Homeక్రీడలుBetting App | చిక్కుల్లో శిఖ‌ర్ ధావ‌న్.. విచారణకు హాజ‌రు కావాల‌ని ఈడీ సమన్లు

Betting App | చిక్కుల్లో శిఖ‌ర్ ధావ‌న్.. విచారణకు హాజ‌రు కావాల‌ని ఈడీ సమన్లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Betting App | ఆన్‌లైన్ బెట్టింగ్ ముళ్లను పూర్తిగా ఎండగట్టే దిశగా అడుగులు ప‌డుతున్నాయి. ఇప్పటివరకు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు నోటీసులు జారీ చేసి, వారిపై కేసులు నమోదు చేస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.

దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న బెట్టింగ్ యాప్(Betting App) కేసు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. నిషేధిత బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన వ్యవహారంపై ఇప్పటికే పలు రంగాల ప్రముఖులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణకు ఎదురవుతున్నారు. తాజాగా టీమ్‌ ఇండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా ఈ కేసుతో వెలుగులోకి వచ్చారు.

Betting App | శిఖ‌ర్‌కి స‌మ‌న్లు..

ఈడీ అధికారులు శిఖర్ ధావన్‌(Shikhar Dhawan)కు సమన్లు జారీ చేశారు. 1xBet అనే యాప్‌కు సంబంధించి మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ యాప్ ద్వారా పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు, పన్ను ఎగవేత జరిగాయని, అందులో ప్రమోషన్లతో సహకరించినవారిపై దర్యాప్తు కొనసాగుతోంది. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు పలువురు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఈడీ(Enforcement Directorate) ముందు హాజరై తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఇప్పటికీ ఈ కేసులో విచారణ కొనసాగుతుండగా, కొత్తగా శిఖర్ ధావన్ పేరు చర్చకు రావడం చర్చనీయాంశమైంది.

ఈడీ నివేదికల ప్రకారం, ఈ బెట్టింగ్ యాప్‌లు వినియోగదారుల నుంచి కోట్లాది రూపాయలు గుంజి, విదేశాల్లో అక్రమ లావాదేవీలకు వాడుతున్నట్లు అనుమానాలు ఉన్నాయి. పెట్టుబడిదారులతో పాటు సెలబ్రిటీల ప్రమోషన్ల ద్వారా ప్రజలను ఆకర్షించి, అనంతరం మోసాలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో దర్యాప్తు మరింత ముమ్మరమవుతుండగా, మరెంతమంది ప్రముఖుల పేర్లు బయటకు వస్తాయో చూడాలి.