అక్షరటుడే, వెబ్డెస్క్:Haryana | ఓ వివాహితను అత్తింటి వారు హత్య చేశారు. ఇంటి ఆవరణలోనే ఆమెను పూడ్చి పెట్టి.. ఇంట్లో నుంచి పారిపోయిందని ప్రచారం చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు(Haryana Police) ఆమె మృతదేహాన్ని వెలికితీసి ఆమె అత్తింటివారిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది.
హర్యానాలోని ఫరీదాబాద్(Faridabad)కు చెందిన తను కుమార్ రెండేళ్ల క్రితం అరుణ్ సింగ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే పెళ్లయిన నాటి నుంచే ఆమెను అత్తమామలు కట్నం కోసం వేధించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో రెండు నెలలుగా ఆమె కనిపించడం లేదు. ఆమెను ఏప్రిల్ 23న హత్య చేశారు. ఇంటి ముందు గుంత తవ్వి అందులో పూడ్చి పెట్టారు. అంతేగాకుండా ఆమె ఇంట్లో నుంచి పారిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Haryana | తండ్రి ఫిర్యాదుతో..
తను కుమార్ పారిపోయిందని చెప్పడంతో ఆమె తండ్రి హకీమ్ వారింటికి వెళ్లి పరిశీలించారు. తన కూతురిని వారే ఏదో చేసి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు శుక్రవారం తను కుమార్ అత్తవారింట్లో ఆమె మృతదేహాన్ని(Dead Body) వెలికి తీశారు. కుమార్ భర్త అరుణ్ అత్తమామలు, వదినను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.