అక్షరటుడే, వెబ్‌డెస్క్ :YS Sharmila | గత కొద్ది రోజులుగా వైఎస్ షర్మిళ (YS Sharmila) ఏపీ రాజకీయాలలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. మొన్నటి వరకు జగన్‌ను ఎండగట్టిన షర్మిళ ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తోంది. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన ఆందోళనల్లో వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan), చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)లపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు.
YS Sharmila | తగ్గేదే లే..
విశాఖ స్టీల్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం(Congress Party Government) స్థాపించిన పరిశ్రమ అని షర్మిల అన్నారు. ‘కాంగ్రెస్ హయాంలో ప్లాంట్ లాభాల్లో ఉంది. బీజేపీ ప్రభుత్వం(BJP Government) స్టీల్ ప్లాంట్ పై సైలెంట్ కిల్లింగ్ మెథడ్‌ను ఉపయోగిస్తుంది. కుక్కను చంపాలి అంటే పిచ్చిది అని ముద్ర వేయాలి అనేది సామెత. ఇదే ఫార్ములా స్టీల్ ప్లాంట్ మీద ప్రయోగం చేస్తుంది. ఉద్యోగాలను తొలగిస్తున్నారు, ముడి సరుకు అందకుండా కుట్రలు చేస్తున్నారు’ అంటూ షర్మిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘కాంగ్రెస్ హయాంలో స్టీల్ ప్లాంట్‌కు ఒక మైన్ ఇవ్వాలని అనుకుంది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్‌కు సొంత మైన్ ఇవ్వకుండా కుట్ర చేశారు. స్టీల్ ప్లాంట్‌ను ఆదుకున్నామని బీజేపీ చెప్పేది అబద్ధం. 11 వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఉద్ధరించామని వారు చెప్పడం పచ్చి అబద్ధం’ అని విమర్శించారు.
‘రూ.3 వేల కోట్లు ఇవ్వాలంటే 5 వేల మంది ఉద్యోగులను తొలగించాలని కండీషన్ (Condition) పెట్టారు. ఇప్పటికే 2 వేల మంది కార్మికులను తొలగించారు. మరో 3 వేల మందిని తొలగిస్తారట.. ఇదెక్కడి న్యాయం అని అడుగుతున్నాం. స్టీల్ ప్లాంట్‌ను నిర్వీర్యం చేసి అదానీ కి అప్పగించాలని అనుకుంటున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తుంది. చంద్రబాబు, పవన్‌కి ఇది న్యాయమా? రాజకీయాల కోసం స్టీల్ ప్లాంట్ ను వాడుకున్నారు. మోదీకి మీరు ఊడిగం చేస్తున్నారా? కార్మికులను తొలగిస్తుంటే ఎందుకు అడ్డుకోవడం లేదు? బీజేపీ కుట్రలకు ఎందుకు అడ్డు పడటం లేదు? మీరు మీరు లాలూచీ పడ్డారా ? స్టీల్ ప్లాంట్(Steel Plant)ను అమ్మేస్తుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. తొలగించిన 2 వేల మందిని తిరిగి తీసుకునే వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. ప్రాణత్యాగానికైనా సిద్ధం’ అని షర్మిళ అన్నారు.