Shambala Movie Review | నటీనటులు: ఆది సాయికుమార్ Adi Sai Kumar, అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక్, ఇంద్రనీల్, ప్రియ, నిర్మలమ్మ, హర్షవర్ధన్, మీసాల లక్ష్మణ్ తదితరులు
దర్శకుడు: యుగంధర్ ముని
నిర్మాత: రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి
ప్రొడ్యూసర్: శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫి: ప్రవీణ్ కె బంగార్రి
ఎడిటర్: శ్రవణ్ కటికనేని
డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ హీరోగా పలు సినిమాలు చేసినా.. ఏ చిత్రం కూడా మంచి బ్రేక్ ఇవ్వలేదు. ఇక రూట్ మార్చి డిఫరెంట్ కథనంతో ఇప్పుడు శంబాల అనే చిత్రం చేశారు. ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకుంది. క్రిస్మస్ కానుకగా గురువారం(డిసెంబర్ 25న) విడుదలైన ఈ సినిమా.. ఆదికి బ్రేక్ ఇచ్చిందా? లేదా? అనేది చూద్దాం.
Shambala Movie Review | కథ:
శంబాల అనే ప్రశాంతమైన ఊరిలో ఒక అర్ధరాత్రి ఆకాశం నుంచి ఉల్క పడి ఊరినే కుదిపేస్తుంది. ఆ ఘటనతో ఊరిలో వరుసగా అపశకునాలు మొదలవుతాయి. రాములు (రవి వర్మ) ఇంటిని ఒక అజ్ఞాత శక్తి ఆవహిస్తుంది. అతని ఆవు ఇచ్చే పాలు రక్తంలా మారుతాయి. ఊరిలో వింత వింత సంఘటనలు, భయం కలిగించే పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఈ విషయం సైంటిస్టులకు చేరుతుంది. ఆ ఉల్క రాయి ఏమిటి? దాని ప్రభావం ఏంటి? అని తెలుసుకునేందుకు సైంటిస్ట్ విక్రమ్ (ఆది సాయికుమార్) శంబాలకు వస్తాడు. అదే సమయంలో స్వామిజీ ఆ ఆవును దెయ్యం శక్తి పట్టిందని, దాన్ని చంపేయాలని ఆదేశిస్తాడు. సర్పంచి సహా ఊరి పెద్దలంతా అదే నిర్ణయం తీసుకుంటారు. కానీ, రాములు తల్లి ఆవును కాపాడుతుంది. అయినా వెంబడింపు కొనసాగుతుంది. ఈ సమయంలో విక్రమ్ రంగంలోకి దిగి ఆవును రక్షిస్తాడు.
విక్రమ్ ఉల్కపై పరీక్షలు చేయడం మొదలుపెట్టిన క్రమంలో ఊరిలో భయంకరమైన సంఘటనలు మరింత తీవ్రమవుతాయి. ఆ శక్తి ప్రభావంతో రాములు పలువురిని హత్య చేసి చివరకు తానే చనిపోతాడు. ఆ తర్వాత అదే అసుర శక్తి కృష్ణ (లక్ష్మణ్)ని ఆవహిస్తుంది. మెడ చుట్టూ పురుగులా తిరుగుతూ, తన కోరికలు తీర్చుకున్న తర్వాత ఆ మనిషిని చంపి మరో శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇదే కొనసాగితే ఊరు పూర్తిగా నాశనం అవుతుందని గ్రహించిన విక్రమ్.. ఊరి ప్రజలతో కలిసి ఆ శక్తిని అంతం చేయాలని నిర్ణయించుకుంటాడు. అసలు ఆ ఉల్కలో దాగున్న శక్తి ఏంటి? దాన్ని విక్రమ్ ఎలా ఎదుర్కొన్నాడు? ఇందులో అర్చన పాత్ర ఏమిటి? శివుడికి ఈ కథకు ఉన్న అనుబంధం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానమే మిగిలిన సినిమా.
Shambala Movie Review | నటీనటుల పర్ఫార్మెన్స్:
చాలా కాలంగా ఆది సాయికుమార్ సినిమాలను ఓటీటీల్లోనే చూసి అభిమానిస్తున్నవాళ్లకు ‘శంబాల’ను థియేటర్లో చూసే అనుభూతి కచ్చితంగా కొత్తదిగా ఉంటుంది. ఈ సినిమా అతడి ఫ్యాన్స్‌కు మంచి సంతృప్తినిచ్చేలా ఉంది. విక్రమ్ పాత్రలో ఆది బాగా ఒదిగిపోయాడు. కొన్ని సందర్భాల్లో ఆ క్యారెక్టర్ కొద్దిగా ప్యాసివ్‌గా అనిపించినా, మొత్తం మీద మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. పాత్రకు తగినట్టుగా ఇంటెన్స్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. అతడి లుక్, నటన రెండూ ఆకట్టుకుంటాయి.
దేవి పాత్రలో అర్చన అయ్యర్ మొదట్లో సాధారణంగానే అనిపించినా, కథలో ట్విస్ట్ వచ్చిన తర్వాత ఆ పాత్రను చూసే దృష్టికోణమే మారిపోతుంది. స్వామీజీ పాత్రకు మహదేవన్ సరైన ఎంపికగా నిలిచాడు. లక్ష్మణ్ తన మీసాల లుక్‌తో పాటు, రవి వర్మ కీలక పాత్రల్లో చక్కగా రాణించారు. మంచి నటిగా పేరు ఉన్న స్వశిక నుంచి పెద్దగా పెర్ఫామెన్స్ ఆశించాల్సిన అవసరం లేకపోయినా, ఆమె తన గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సీరియల్ నటుడు ఇంద్రనీల్, మధుసూదన్ కీలక పాత్రల్లో బాగానే మెప్పించారు. సిజ్జు, హర్షవర్ధన్ తదితరులు తమ పాత్రల పరిధిలోనే కనిపించి, పెద్దగా ప్రత్యేకంగా గుర్తుండిపోయేలా చేయలేకపోయారు.
Shambala Movie Review | టెక్నికల్ పర్ఫార్మెన్స్:
థ్రిల్లర్ చిత్రాలకు ఇంటెన్స్ బీజీఎం ఇవ్వడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీ చరణ్ పాకాల ఈ సినిమాతో మరోసారి తన సిగ్నేచర్‌ను చాటుకున్నాడు. పాటలు ఓ మోస్తరుగా అనిపించినా, బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమా బలంగా నిలబడేలా చేసింది. బీజీఎం ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉంది.పవన్ బంగారి సినిమాటోగ్రఫీ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. విజువల్స్ ఆకట్టుకునేలా ఉండటంతో పాటు, కథకు కావాల్సిన మూడ్‌ను బాగా ఎలివేట్ చేశాయి. నిర్మాణ విలువలు కొన్ని చోట్ల ఇంకా మెరుగ్గా ఉండాల్సిన అవకాశం ఉన్నా, ఓవరాల్‌గా చూస్తే ఆది మార్కెట్ స్థాయిని మించే స్థాయిలో ఖర్చు పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తుంది.
రైటర్ కమ్ డైరెక్టర్ యుగంధర్ ముని తన ప్రతిభను ఈ సినిమాతో బాగా నిరూపించాడు. అయితే ప్రథమార్థాన్ని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా, నిలకడగా తీర్చిదిద్దితే ఇంకా బావుండేదని అనిపిస్తుంది. అయినా కథకు కీలకమైన ఎపిసోడ్లను మలిచిన తీరు మాత్రం ఆకట్టుకుంటుంది. ప్రీ-ఇంటర్వెల్ నుంచి సినిమా ఉత్కంఠభరితంగా మారి ప్రేక్షకులను సీటుకు అతుక్కుపోయేలా చేస్తుంది. మొత్తంగా చూస్తే ప్రేక్షకులకు కొంచెం భిన్నమైన అనుభూతిని అందించడంలో యుగంధర్ ముని సక్సెస్ అయ్యాడు.
ప్లస్ పాయింట్స్
ఆది నటన
బీజీఎం
సినిమాటోగ్రఫీ
కథ
మైనస్ పాయింట్స్
నిర్మాణ విలవలు
లాజిక్స్
సేమ్ సీన్స్
విశ్లేషణ:
ఇటీవల సూపర్‌నేచురల్ అంశాలకు హర్రర్, థ్రిల్లర్ ఎలిమెంట్లు జోడించి తెరకెక్కుతున్న సినిమాలు మంచి ఆదరణ పొందుతున్నాయి. అదే ఫార్మూలాలో రూపొందిన శంబాల కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. విరూపాక్ష తరహా జోనర్లో సాగినా, ఇందులో మరింత బలమైన కథ, ఆసక్తికరమైన కథనం కనిపిస్తాయి. ట్విస్ట్‌లు, సస్పెన్స్‌లు, హర్రర్ మూమెంట్స్‌తో పాటు కామెడీని మేళవించి ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది.
ఫస్ట్ హాఫ్ ఉల్క చుట్టూ తిరుగుతూ ఊరిలో భయాందోళనలు పెంచుతుంది. రాములు ఆవు రక్తం లాంటి పాలు ఇవ్వడం, దెయ్యం నమ్మకాలు, విక్రమ్ పరిశోధనలు కథను ఇంట్రెస్టింగ్గా నడిపిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ గూస్బంప్స్ తెప్పిస్తుంది. సెకండ్ హాఫ్‌లో ఆ పురుగు ఒకరి తర్వాత మరొకరిని పట్టి వరుస చావులకు కారణమవుతుండగా, దాన్ని ఆపే ప్రయత్నాలు ఉత్కంఠను పెంచుతాయి. థ్రిల్లింగ్ ఎలిమెంట్లతో పాటు హర్రర్ కామెడీ బాగా వర్క్ అయ్యింది. క్లైమాక్స్ మాత్రం ఎమోషన్, సస్పెన్స్‌లతో వేరే లెవల్లో నిలిచి, చివరి 15–20 నిమిషాలు సినిమాకి హైలైట్‌గా మారాయి. మొత్తానికి ఈ చిత్రం ఆదికి మంచి హిట్ ఇచ్చిందనే చెప్పాలి.
రేటింగ్ – 2.75/5