అక్షరటుడే, కామారెడ్డి : Shabbir Ali Corruption Allegations | అవినీతిపై ఎమ్మెల్యే ఊకదంపుడు మాటలు వద్దని, ఎమ్మెల్యేనే పెద్ద అవినీతి కింగ్ అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. పట్టణంలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు.
Shabbir Ali Corruption Allegations | అభివృద్ధి కోసమే పొత్తు..
షబ్బీర్అలీ మాట్లాడుతూ.. కామారెడ్డి (Kamareddy) అభివృద్ధి కోసం 22మంది కాంగ్రెస్ కౌన్సిలర్లతో పాటు 11మంది బీఆర్ఎస్ కౌన్సిలర్ల మద్దతు తీసుకున్నామన్నారు. అనంతరం ఉమారాణి ఛైర్పర్సన్గా ఎన్నికయ్యారని, వైస్ ఛైర్మన్ బీఆర్ఎస్కు వెళ్లిందన్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు నిజామాబాద్ స్మార్ట్ సిటీ (Nizamabad Smart City) కోసం రూ.వెయ్యి కోట్లు ఇస్తున్నామని చెప్తే కామారెడ్డికి కూడా రూ.500 కోట్లు ఇవ్వాలని ఆడిగినట్టు చెప్పారు. ప్రత్యేక నిధుల కింద కామారెడ్డికి రూ.300 కోట్లు ఇస్తానని సీఎం హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఇప్పటికే కామారెడ్డిలో రూ.200 కోట్లతో పలు పనులు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. కామారెడ్డిలో తాగునీటి సమస్య లేకుండా శాశ్వత ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని, మార్చి చివరి నాటికి పూర్తిస్థాయిలో కామారెడ్డి పట్టణంలో తాగునీటి సమస్య (Drinking Water Problem) తీరుతుందన్నారు. పట్టణంలో 8 కిలోమీటర్ల అంతర్గత పైప్లైన్ పనులు కొనసాగుతున్నాయన్నారు.
Shabbir Ali Corruption Allegations | భూములు అమ్ముకున్నారు
ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి (MLA Venkata Ramana Reddy) మాటిమాటికి అవినీతి గురించి మాట్లాడుతున్నాడని, ఆయనే అవినీతి కింగ్ అని షబ్బీర్ అలీ ఆరోపించారు. రైతుల కష్టార్జితంతో డిగ్రీ కళాశాల కోసం భూములు కొనుగోలు చేస్తే వాటిని అరోరా కళాశాలకు అమ్ముకున్నారని, దాని విలువ రూ.18 కోట్లు ఉంటుందని.. ఇది అవినీతి కాదా అని ప్రశ్నించారు. 2015లో తన చేతితో ఎమ్మెల్సీ బీఫారం ఇచ్చి నామినేషన్ వేయిస్తే టికెట్ అమ్ముకుని పారిపోయాడని విమర్శించారు. 45ఏళ్ల తన రాజకీయ జీవితంలో తనపై ఒక్క మరకలేదని, ఒక్క పెట్టి కేసు కూడా లేదని, తన జీవితం తెరిచిన పుస్తకమని చెప్పారు. ఆకాశం మీద ఉమ్మితే మనమీదే పడుతుందని గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యేకు సూచించారు. అభివృద్ధిలో తమతో కలిసి రావాలని, పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా కామారెడ్డిని అభివృద్ధి చేసుకుందామని సూచించారు. కామారెడ్డిని అవినీతి రహిత మున్సిపాలిటీగా తీర్చి దిద్దుకుందామని, కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కామారెడ్డి ప్రజలు హర్షించే విధంగా పని చేసి చూపించాలని, మంచి పాలకవర్గాన్ని అందించానని తనకు పేరు తేవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఇచ్చిన పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ ఇప్ప ఉమారాణి, నూతన కౌన్సిలర్లు పాల్గొన్నారు.