అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Shooting Coach | జాతీయ షూటింగ్ కోచ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఆయన తనపై లైంగిక దాడి చేశాడని ఓ మైనర్ క్రీడాకారిణి ఫిర్యాదు చేశారు. దీంతో అతడిపై సస్పెన్షన్ (Suspension) వేటు పడింది.
అంకుశ్ భరద్వాజ్ (Ankush Bhardwaj) నేషనల్ షూటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఫరీదాబాద్‌లో 17 ఏళ్ల మహిళా షూటర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. బాధిత షూటర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హర్యానా పోలీసులు కేసు నమోదు చేశారు. సాక్షుల వాంగ్మూలం రికార్డు చేశారు.
Shooting Coach | హోటల్‌కు పిలిచి..
ఫరీదాబాద్ (Faridabad)లో ఓ హోటల్‌కి తన ఆటతీరును అంచనా వేయాలని పిలిచి, తనపై కోచ్ అంకుశ్ లైంగిక దాడికి పాల్పడినట్లు షూటర్ ఆరోపించారు. దీంతో జాతీయ సమాఖ్య అతడిని సస్పెండ్ చేసింది. ఫరీదాబాద్‌లో భరద్వాజ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైనట్లు ఎన్‌ఆర్‌ఏఐ (నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) తెలిపింది. అతడిని సస్పెండ్ చేశామని, షోకాజ్ నోటీసు (Showcause Notice) జారీ చేస్తామని ఎన్‌ఆర్‌ఏఐ కార్యదర్శి రాజీవ్ భాటియా తెలిపారు. అతను తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలన్నారు. విచారణ పూర్తయ్యే వరకు ఏ కోచింగ్ కార్యకలాపాలలోనూ పాల్గొనడని స్పష్టం చేశారు.
గత ఏడాది ఆగస్టు నుంచి భరద్వాజ్ వద్ద శిక్షణ పొందుతున్న ఆ బాలిక, ఈ సంఘటనతో తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు తెలిపింది. పదేపదే అడగడంతో జనవరి 1న తన తల్లి ముందు ఈ విషయం చెప్పిందని పేర్కొంది. మాజీ పిస్టల్ షూటర్ అయిన భరద్వాజ్, తన పోటీల కాలంలో బీటా-బ్లాకర్ ఉపయోగించినందుకు 2010లో డోపింగ్ నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. కాగా క్రీడాకారులను ఉత్తమంగా తీర్చిదిద్దాల్సిన కోచ్ ఇలాంటి చర్యలకు పాల్పడటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారి తీరుతో మహిళలు క్రీడల్లోకి రావాలంటే ఆలోచిస్తారన్నారు. కోచ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.