అక్షరటుడే, వెబ్‌డెస్క్: Janasena MLA | రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే (Railway Koduru Janasena MLA), కూటమి ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌పై లైంగిక ఆరోపణలు వచ్చాయి. ఆయన తనను పెళ్లి పేరుతో మోసం చేశాడని ఓ మహిళ వీడియో విడుదల చేసింది. అంతేగాకుండా ఎమ్మెల్యే సదరు మహిళతో అసభ్యకర రీతిలో వీడియో కాల్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు (MLA Arava Sridhar) ఓ మహిళ ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది. ఆమె ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తోంది. అనంతరం ఆయన ఆమెతో నిరంతరం ఫోన్ మాట్లాడటం, చాటింగ్ చేయడం చేసేవాడు. తన కోరిక తీర్చకపోతే ఆమె మూడేళ్ల కుమారుడిని చంపేస్తానని బెదిరించాడు. అనంతరం ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఏడాదిన్నర వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా అబార్షన్ కూడా చేయించాడు. ఈ మేరకు ఎమ్మెల్యేకు సంబంధించిన వీడియోలు, చాటింగ్‌లను వైసీపీ బయట పెట్టింది.
Janasena MLA | నరకం చూపించాడు
బాధిత మహిళ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే తనకు ఏడాదిన్నరగా నరకం చూపించాడని వాపోయింది. పెళ్లి పేరుతో మోసం చేశాడని ఫిర్యాదు చేసింది. శారీరకంగా తనను హింసించాడని పేర్కొంది. అయితే తన కొడుకుపై ఆరోపణల్ని శ్రీధర్ తల్లి ప్రమీల ఖండించింది. కులం పేరు చెప్పి సదరు మహిళ తనకు కొడుకుకు దగ్గరైందన్నారు. ఇంటికి రావడం మొదలు పెట్టిందని, పగలు, రాత్రి తేడా లేకుండా ఫోన్లు చేసేదని చెప్పారు. పెళ్లి చేసుకోవాలంటూ బ్లాక్ మెయిల్ చేసేదని ఆరోపించారు. ఈ విషయంపై ఇప్పటికే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని ఆమె పేర్కొన్నారు.
Janasena MLA | మహిళా కమిషన్ సీరియస్
ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ తీసుకుంది. కమిషన్ ఛైర్పర్సన్ శైలజ బాధితురాలితో ఫోన్లో మాట్లాడారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.