అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Weather Updates | రాష్ట్ర వ్యాప్తంగా చలితీవ్రత కొనసాగుతోంది. గత నాలుగు రోజులు రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో (Telangana) ఈ సీజన్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు గురువారం తెల్లవారుజామున నమోదయ్యాయి. చలితీవ్రతలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. సాయంత్రం ఆరు కాగానే మొదలవుతున్న చలి ఉదయం 10 గంటల వరకు కూడా అధికంగా ఉంటుంది. మధ్యాహ్నం సైతం చలిగాలులు వీస్తున్నాయి.
Weather Updates | ఆసిఫాబాద్‌లో 5.4 డిగ్రీలు
తెల్లవారు జామున రికార్డుస్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు (Temperatures) నమోదవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాల్లో చలి అధికంగా ఉండడంతో ప్రజలు చలిమంట కాచుకుంటున్నారు. వెచ్చని దుస్తులు ధరిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున ఆసిఫాబాద్‌లో 5.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. రంగారెడ్డి 5.5, ఆదిలాబాద్ 6.1, సిద్దిపేట 6.4, సంగారెడ్డి 6.5, వికారాబాద్ 6.7, నిర్మల్ 7.3, కామారెడ్డి 7.3, నారాయణపేట 7.3, జగిత్యాల 7.5, సిరిసిల్ల 7.7, మెదక్ 7.8, పెద్దపల్లి 7.8, నిజామాబాద్ (Nizamabad)లో 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
హైదరాబాద్ (Hyderabad) నగరంలో సైతం చలి పంజా విసురుతోంది. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్ నమోదు అవుతోంది. మెయినాబాద్‌లో 5.5, ఇబ్రహీంపట్నం 6.6, హెచ్‌సీయూ 7.1, రాజేంద్ర నగర్ 8.3, మౌలాలి 8.9, గచ్చిబౌలి 10.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
Weather Updates | లంబసింగిలో 4 డిగ్రీలు
ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) సైతం చలితీవ్రత అధికంగా ఉంది. అల్లూరి జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. చింతపల్లి 6, లంబసింగి 4, పాడేరు 4, అరకు 7 డిగ్రీలు నమోదు అయ్యాయి. దట్టంగా పొగ మంచు కురుస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.