Homeజిల్లాలునిజామాబాద్​Sriram Sagar | శ్రీరాంసాగర్​కు ఉధృతంగా వరద..

Sriram Sagar | శ్రీరాంసాగర్​కు ఉధృతంగా వరద..

అక్షర టుడే, మెండోరా : Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్​కు ఎగువ నుంచి వరద ఉధృతంగా వస్తోంది. గత వారం రోజులుగా ప్రాజెక్ట్​లోకి భారీగా ఇన్​ఫ్లో వస్తుండటంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.

మహారాష్ట్ర, స్థానికంగా కురిసిన వర్షాలతో గోదావరికి భారీగా వరద(Heavy Flood) వస్తోంది. దీంతో ఎస్సారెస్పీ(SRSP)లోకి ప్రస్తుతం 3.90 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు 39 వరద గేట్లు ఎత్తి 3 లక్షల క్యూసెక్కులు గోదావరిలోకి వదులుతున్నారు. ఎస్కేప్​ గేట్ల ద్వారా 4 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువకు 4 వేలు, సరస్వతి కాలువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. మిషన్​ భగీరథకు 231, ఆవిరి రూపంలో 600 క్యూసెక్కులు పోతోంది. మొత్తంగా 3,09,231 క్యూసెక్కుల ఔట్​ ఫ్లో నమోదు అవుతోంది. ప్రాజెక్ట్​ నుంచి వరద కాలువ, లక్ష్మి కాలువ, ఎత్తిపోతల పథకాలకు నీటి విడుదలను నిలిపి వేశారు.

 Sriram Sagar | 57 టీఎంసీలకు చేరిన నీరు

శ్రీరామ్​ సాగర్​(Sriram Sagar)లోకి ఎగువ నుంచి భారీగా వరద రావడంతో అధికారులు నిన్నటి వరకు దిగువకు భారీగా నీటిని విడుదల చేశారు. ఇన్​ఫ్లో కంటే ఔట్​ ఫ్లో అధికంగా ఉండేలా చర్యలు చేపట్టారు. దీంతో ప్రాజెక్ట్​ నీటిమట్టం వేగంగా తగ్గిపోయింది. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం 1084.3 (57.6 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది. కాగా సోమవారం నుంచి ఔట్​ ఫ్లో తగ్గించడంతో ప్రాజెక్ట్​ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.

 Sriram Sagar | కొనసాగుతున్న విద్యుత్​ ఉత్పత్తి

ప్రాజెక్ట్​ దిగువన గల జల విద్యుత్​ కేంద్రంలో కరెంట్​ ఉత్పత్తి కొనసాగుతోంది. దిగువకు నీటి విడుదల భారీగా ఉండటంతో సామర్థ్యాన్ని మించి ఉత్పత్తి చేస్తున్నారు. నాలుగు టర్బైన్ల ద్వారా నిత్యం 36 మెగావాట్ల విద్యుత్​ ఉత్పత్తి చేయవచ్చు. ప్రస్తుతం అంతకంటే కొంచెం ఎక్కువగా విద్యుత్​ ఉత్పత్తి అవుతోందని జెన్​ కో అధికారులు తెలిపారు.

 Sriram Sagar | అప్రమత్తంగా ఉండాలి

శ్రీరామ్​ సాగర్​ నుంచి గోదావరిలోకి భారీగా నీటిని వదులుతుండటంతో నది పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నదిపై గల వంతెనల వద్ద ఫొటోలు, వీడియోల కోసం వెళ్లొద్దన్నారు. అలాగే రైతులు, మత్స్యకారులు నది సమీపంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు.