అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | జిల్లాలో సంచలనం సృష్టించిన మాక్లూర్ హత్యల కేసులో నిందితులకు న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి (Public Prosecutor Dharpalli Rajeshwar Reddy) తెలిపిన వివరాల ప్రకారం.. మాక్లూర్ మండల కేంద్రానికి (Makloor) చెందిన ప్రసాద్, సాన్విక దంపతులతో పాటు వారి పిల్లలైన చైత్రిక, చైత్రిక్, ప్రసాద్ చెల్లెళ్లు స్వప్న, శ్రావణి మొత్తం ఆరుగురు వివిధ ప్రాంతాల్లో హత్యకు గురయ్యారు.
ప్రసాద్, ప్రశాంత్ స్నేహితులు. ప్రసాద్‌కు భారీగా అప్పులు అయ్యాయి. దీంతో బ్యాంక్‌లో లోన్ ఇప్పిస్తానని ప్రశాంత్ నమ్మించాడు. ప్రసాద్ ఇంటిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తే లోన్ ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో నమ్మిన ప్రసాద్ తన ఇంటిని మెడిద ప్రశాంత్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాడు. అయితే ఆయన లోన్ ఇప్పించకపోగా అడిగిన ప్రతిసారి దాటవేశాడు. దీంతో గట్టిగ నిలదీయడంతో ఆ కుటుంబాన్ని మొత్తం హత్య చేస్తే ఆ ఇల్లు తనకు దక్కుతుందని పథకం వేశాడు. తన తల్లి ఒడ్డెమ్మ, వంశీకృష్ణ, తన తమ్ముడు(మైనర్) సాయంతో ప్రశాంత్ ఆరుగురిని హత్య చేశాడు. ప్రశాంత్, అతడి తమ్ముడు, వంశీకృష్ణ, ఒడ్డెమ్మలు కలిసి ఈ ఆరుగురిని హత్య చేసినట్లుగా పోలీసులు ఆధారాలు సేకరించి కోర్టులో ప్రవేశపెట్టారు.
Nizamabad City | ప్రసాద్‌ను మొదట హత్య చేసి..
ప్రసాద్‌ను 2023వ తేదీ నవంబర్ 29న మదన్‌పల్లి అటవీప్రాంతంలో (Madanpally forest area) నిందితుడు ప్రశాంత్ బండరాయితో కొట్టి హత్య చేశాడు. అనంతరం ప్రసాద్ ఎక్కడున్నాడో చూపిస్తామంటూ ఆయన భార్య సాన్వికను కారులో తీసుకెళ్లి నవీపేట్ మండలం (Navipet Mandal) జగ్గారావు ఫారం వద్ద వద్ద తాడుతో ఉరి వేసి హత్య చేశారు. బాసర వంతెన క్రింద ఆమె మృతదేహాన్ని పడవేశారు. అనంతరం వారి ఇద్దరు కవల పిల్లలైన చైత్రిక, చైత్రిక్లను ప్రసాద్ చెల్లెళ్లయిన స్వప్న, శ్రావణిలను సైతం ఈ ముగ్గురు వేరువేరు ప్రాంతాల్లో దారుణంగా హత్య చేశారు. ప్రసాద్ తల్లిని కూడా
హత్య చేయాలని ప్రశాంత్ ప్లాన్ వేశాడు. అయితే ప్రశాంత్ తీసుకెళ్లిన వారు ఎవరు తిరిగి రాకపోవడంతో ఆమె అనుమానం వచ్చి అతడి నుంచి తప్పించుకుంటుంది.
Nizamabad City | రాష్ట్రంలో సంచలనంగా మారిన కేసు..
అప్పట్లో ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముగ్గురు కలిసి ఏకంగా ఆరుగురిని హత్య చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన నిజామాబాద్ జిల్లా సెషన్స్ జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి (Judge GVN Bharathalakshmi) ముగ్గురు నిందితులైన ప్రశాంత్, వంశీకృష్ణ, ఒడ్డెమ్మలకు జీవిత ఖైదుతో పాట, దోపిడీ నేరానికి గాను.. పదేళ్ల జైలు, మోసం చేసినందుకు గాను ఏడేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అనుభవించాలని తీర్పు వెలువరించారు.