అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vikarabad | వికారాబాద్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ సర్పంచ్ విజయోత్సవ ర్యాలీ ఆనందాన్ని క్షణాల్లో విషాదంగా మార్చింది. పోడూరు మండలం రాకంచర్ల గ్రామం (Rakancharla Village)లో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా ఏడేళ్ల చిన్నారి మృతి చెందడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వివరాల్లోకి వెళ్తే… సోమవారం సర్పంచ్ల ప్రమాణస్వీకారం పూర్తవడంతో కాంగ్రెస్ సర్పంచ్ (Congress Sarpanch) కమ్లీబాయ్ ఆధ్వర్యంలో రాకంచర్ల గ్రామంలో విజయోత్సవ ర్యాలీ (Rally) ఏర్పాటు చేశారు. ఎలాంటి అధికార అనుమతి లేకుండా డీజే ఏర్పాటు చేసి ర్యాలీ నిర్వహించినట్టు సమాచారం. ఈ ర్యాలీని వీక్షిస్తున్న సమయంలోనే ఏడేళ్ల చిన్నారి కుర్వా సౌజన్యపై నుంచి సర్పంచ్‌కు సంబంధించిన కారు వెళ్లింది.
Vikarabad | ర్యాలీలో విషాదం..
కారు చక్రాల కింద నలిగిన బాలికకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆమెను పరిగి ప్రభుత్వ ఆస్పత్రి (Government Hospital)కి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ సౌజన్య మృతి చెందింది. చిన్నారి మృతితో గ్రామంలో తీవ్ర ఆవేదన, ఆగ్రహం వెల్లువెత్తింది. ర్యాలీలో సర్పంచ్ కారు కింద పడటంతోనే తమ కూతురు మృతి చెందిందని బాలిక తండ్రి, గ్రామస్తులు ఆరోపించారు. అయితే బాలిక కారు కింద పడలేదని సర్పంచ్ భర్త పెంటయ్య వాదించడంతో వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలో ఆస్పత్రి ముందు బాధిత కుటుంబసభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిర్లక్ష్యం, అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడంపై కూడా విచారణ చేపట్టినట్టు సమాచారం. ఈ విషాద ఘటన ప్రతి ఒక్కరిని కలిచి వేసింది.