అక్షరటుడే, వెబ్‌డెస్క్: NIT Students : వారంతా ఇంజినీరింగ్ విద్యార్థలు.. ఎంతో సరదాగా జలపాతం చూడడానికి అడవిలోకి వెళ్లారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆంక్షలు విధించినా.. కాపలా సిబ్బందిని మాయ చేసి, కళ్లుగప్పి అడవిలోకి చొరబడ్డారు. భారీ వర్షంతో దారి తప్పారు. కాకులు దూరని కారడవిలో చిక్కుకుపోయారు. దిక్కుతోచని స్థితిలో ఆరు గంటలకు పైగా అల్లాడారు. అటవీశాఖ, పోలీసు అధికారుల సాయంతో ఎట్టకేలకు సురక్షితంగా బయటపడ్డారు.
తెలంగాణ – ఛత్తీస్గఢ్ సరిహద్దులోని (Telangana-Chhattisgarh border) ములుగు జిల్లా (Mulugu district) వెంకటాపురం మండలం (Venkatapuram mandal) మైతాపురం (Maithapuram) అడవుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏడుగురు వరంగల్ NIT విద్యార్థులు (Warangal NIT students) శనివారం ఉదయం వెంకటాపురం బయలుదేరారు. అక్కడికి చేరుకున్నాక బొగత జలపాతాల Bogatha waterfalls సందర్శనకు అనుమతి లేదని తెలిసింది. కానీ, వీరు వెనక్కి వెళ్లిపోలేదు. ఎలాగైనా జలపాతం చూసి తీరాలని నిర్ణయించుకున్నారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించి, కాపలా సిబ్బంది కళ్లుగప్పి అడవిలోపలికి వెళ్లారు.

NIT Students : బతుకు జీవుడా అంటూ..
జలపాతం వద్దకు చేరుకుని ఎంజాయ్ చేశారు. సెల్ఫీలతో సందడి చేశారు. సాయంత్రం వరకు సరదాగా గడిపారు. ఇక తిరుగు ప్రయాణంలోనే అసలు సమస్య మొదలైంది. దారి తప్పి అడవిలోపలకు వెళ్లిపోయారు. ఎంత దూరం వెళ్లినా బయటకు వచ్చే దారి తెలియలేదు. దీంతో ఆరు గంటలపాటు కారడవిలోనే తిరుగుతూ ఉండిపోయారు. చివరికి భయం పట్టుకుని బతుకు జీవుడా అంటూ సాయం కోసం డయల్ 100కు కాల్ చేశారు.
సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది, పోలీసులు తక్షణమే స్పందించారు. ఓ వైపు కుండపోత వర్షం కురుస్తున్నా.. విద్యార్థులను వెతికేందుకు అడవిబాట పట్టారు. విద్యార్థుల లొకేషన్ ఆధారంగా అతి కష్టం మీద కాలినడకన వారి వద్దకు చేరుకున్నారు.
వారిని వెంట తీసుకుని సురక్షితంగా తిరిగి బయటకు వచ్చారు. ఆరు గంటలపాటు ఆచూకీ లేక అల్లాడిన విద్యార్థులు.. సురక్షితంగా గమ్యం చేరుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
NIT Students : అమ్మాయిలు కూడా ఉన్నారు..
క్రూర మృగాలు తిరిగే కారడవిలో చిక్కుకుపోయిన విద్యార్థుల్లో ముగ్గురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు ఉన్నారు. వీరు వరంగల్‌లోని ఎన్ఐటీలో బీటెక్ చదువుతున్నారు. వారాంతం సరదాగా గడిపేందుకు వెళ్లి ఊహించని ప్రమాదంలో చిక్కుకుపోయారు.
పోలీసులు, అటవీశాఖ సిబ్బంది కలిసి విద్యార్థులను వెంకటాపురానికి తీసుకొచ్చారు. అక్కడ వారికి ఆహారం అందించారు. తర్వాత ప్రత్యేక వాహనంలో హన్మకొండకు పంపించారు.
NIT Students : అనుమతి లేదు..
కుండపోత వర్షాలు కురుస్తున్నందున జలపాతాల సందర్శనకు అనుమతి లేదని అటవీశాఖ అధికారులు, పోలీసులు స్పష్టం చేశారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.