అక్షరటుడే, వెబ్డెస్క్: Karnataka High Court | కర్ణాటక ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah) నేతృత్వంలోని కాంగ్రెస్ ఇటీవల తీసుకొచ్చిన ఓ ఉత్తర్వుపై కర్ణాటక హైకోర్టు ధార్వాడ్ బెంచ్ మంగళవారం స్టే విధించింది.
ప్రభుత్వ ప్రాంగణాల్లో ప్రైవేట్ సంస్థలు కార్యకలాపాలు నిర్వహించే ముందు.. ముందస్తుగా అనుమతి తీసుకోవాలనే ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా ఆర్ఎస్ఎస్‌ను (RSS) లక్ష్యంగా చేసుకునే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఈ వ్యవహారం హైకోర్టుకు చేరడంతో ధర్మాసనం స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Karnataka High Court | ఆర్ఎస్‌ఎస్‌ను లక్ష్యంగా చేసుకుని..
ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్యంలోని ఆస్తుల వినియోగానికి సిద్దు సర్కారు నిర్దిష్ట మార్గదర్శకాలను ఈ నెల ప్రారంభంలో జారీ చేసింది. సంబంధిత విభాగాధిపతుల నుండి రాతపూర్వక అనుమతి లేకుండా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల మైదానాలు లేదా ఇతర సంస్థాగత ప్రాంగణాలలో ప్రైవేట్ లేదా సామాజిక సంస్థ కార్యక్రమాలు, సమావేశాలు లేదా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించరాదని పేర్కొంది. కర్ణాటక భూ రెవెన్యూ విద్యా చట్టాల ప్రకారం ఏవైనా ఉల్లంఘనలకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా పరిపాలనలను ఆదేశించింది.
Karnataka High Court | మధ్యంతర ఉత్తర్వులు జారీ
RSS సంబంధిత కార్యకలాపాలను అరికట్టే ప్రయత్నంగా విస్తృతంగా పరిగణించబడుతున్న ప్రభుత్వ ఉత్తర్వును సస్పెండ్ చేస్తూ జస్టిస్ నాగప్రసన్న ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 17కి వాయిదా వేసింది. ప్రభుత్వ ప్రాంగణాల్లో ప్రైవేట్ సంస్థల కార్యకలాపాలకు అనుమతి తీసుకోవాలన్న ఉత్తర్వులను సవాలు చేస్తూ పునశ్చైతన్య సేవా సంస్థ హైకోర్టులో (High Court) పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వ నిర్ణయం చట్టబద్ధమైన కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రైవేట్ సంస్థల హక్కులను ఉల్లంఘిస్తుందని తెలిపింది. పిటిషనర్ల వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ప్రభుత్వ ఆదేశాలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

