అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jubilee Hills by-Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎలాగైనా జెండా ఎగురువేయాలనే లక్ష్యంతో ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ హోరాహోరీగా పోరాడుతుండగా, బీజేపీ వెనుకబడినట్లు కనిపిస్తోంది.
కాషాయ నాయకత్వ వ్యవహార శైలి అనేక అనుమానాలకు తావిస్తోంది. అభ్యర్థి ఎంపిక మొదలు ప్రచార తీరు వరకూ సొంత పార్టీ కేడర్‌లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్య నాయకత్వం ఎందుకిలా వ్యవహరిస్తుందో తెలియక సతమతమవుతోంది. ఈక్రమంలోనే చాలా మంది ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. బీజేపీ శ్రేణుల్లో నెలకొన్న గందరగోళాన్ని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Goshamahal MLA Raja Singh) చేసిన వ్యాఖ్యలు ఎత్తి చూపుతున్నాయి.
Jubilee Hills by-Election | కనిపించని జోష్..
భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party)లో మునుపటి జోష్ కరువైంది. గెలవాలనే కసి ఉన్నట్లు ఏమాత్రం కనిపించడం లేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తెలంగాణలో ఊహించని రీతిలో బీజేపీ బలపడింది. పట్టణాల్లోనే కాదు, పల్లెల్లోనూ ఆ పార్టీ పట్ల భారీగా అభిమానం పెరిగింది. ప్రజా సమస్యలతో పాటు ఉప ఎన్నికల సమయంలోనూ కాషాయ పార్టీ దూసుకెళ్లింది. హుజురాబాద్, దుబ్బాక, మునుగోడు ఎన్నికల సందర్భంగా బీజేపీ ప్రదర్శించిన దూకుడు బీఆర్ ఎస్, కాంగ్రెస్‌ను ఆత్మరక్షణలో పడేశాయి. అలాగే, హైదరాబాద్ (Hyderabad), నిజామాబాద్ (Nizamabad) వంటి మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించి బీజేపీ సత్తా చాటింది. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న భావన అంతటా ఏర్పడింది. అయితే, మారిన రాజకీయ పరిస్థితుల్లో కిషన్‌రెడ్డి అధ్యక్షతన ఎన్నికలకు వెళ్లిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా దూకుడు తగ్గించింది. కేవలం 8 సీట్లకే పరిమితమైంది. అయితే, పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంది. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ మీద అభిమానంతో ప్రజలు బీజేపీకి ఓట్లేశారు తప్పితే రాష్ట్రంలో బీజేపీ ఏదో చేస్తుందని కాదు. ఈ విజయం వెనుక రాష్ట్ర నాయకత్వం పాత్ర పరిమితమే,
Jubilee Hills by-Election | ఊపందుకోని ప్రచారం ..
బీజేపీ రాష్ట్రంలో బలపడేందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills by-Election) రూపంలో మరోసారి అవకాశం వచ్చింది. కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఉప సమరంలో విజయం సాధించడం ఎంతో ప్రధానం. కానీ, అలాంటి గోల్డెన్ చాన్స్‌ను బీజేపీ చేజేతులా చేజార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఉప ఎన్నిక అనివార్యమని తేలడంతోనే కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయి. అభ్యర్థుల ఖరారు నుంచి ప్రచారం వరకూ ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నాయి. కానీ బీజేపీలో మాత్రం ఆ స్థాయిలో సన్నద్ధత కనిపించడం లేదు. చివరి నిమిషం దాకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. చివరకు లెంకల దీపక్‌రెడ్డిని బరిలోకి దింపిన కాషాయ దళం.. ప్రచారాన్ని హోరెత్తించడంలో వెనుకబడింది. ముఖ్య నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇలాకలో జరుగుతున్న బైపోల్‌లో గెలుపు కోసం అందరినీ సమన్వయంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైనట్లే కనిపిస్తోంది. కిషన్‌రెడ్డి కూడా పెద్దగా చొరవ చూపించడం లేదని కేడర్‌లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
Jubilee Hills by-Election | వ్యూహాత్మక వైఫల్యం..
కాంగ్రెస్ వైఫల్యాలు.. బలహీనపడిన బీఆర్ఎస్.. ఈ తరుణంలో రాష్ట్రంలో సొంతంగా ఎదుగేందుకు అవకాశమున్న ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ వ్యవహార శైలి అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే బీజేపీ మీద అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తున్నాయి. బీఆర్ఎస్ (BRS), బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాషాయ పార్టీలో విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని సాక్షాత్తు కేసీఆర్ కూతురు చేసిన ఆరోపణలను ఉదాహరణగా చూపుతోంది. మరోవైపు, రెండు జాతీయ పార్టీలు సిద్ధాంతాలను పక్కనపెట్టి సహకరించుకుంటున్నాయని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. ఈ తరుణంలో ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టడంలో బీజేపీ విఫలమవుతోంది. మరోవైపు, ముఖ్య నాయకుల వ్యవహార శైలితో కేడర్‌లో గందరగోళం నెలకొంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రచారానికి దూరంగా ఉండడం పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను కళ్లకు కడుతోంది. అభ్యర్థి ఎంపిక విషయంలో ముఖ్య నేతల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోలేదన్న ప్రచారం జరిగింది. వారంతా ఇప్పుడు ఉప ఎన్నికకు దూరంగా అందుకు బలం చేకూర్చుతోంది. ఓవైపు బీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటే, మరోవైపు, కాంగ్రెస్ జూబ్లీహిల్స్‌లో పాగా వేసేందుకు పోరాడుతుంటే, బీజేపీ కాడి ఎత్తేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

