అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | కొంతమంది తమ లాభం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఎవరు ఏమైనా పర్వాలేదు తమకు మాత్రం డబ్బులు రావాలని చూస్తున్నారు. తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను కలుపుతున్న వారిని స్థానికులు పట్టుకున్నారు.
హైదరాబాద్ నగర ప్రజలకు జంట జలాశయాలు గండిపేట, (Gandipet) హిమాయత్‌సాగర్ నుంచి తాగు నీరు అందుతుంది. ఈ నీటిని తాగే చాలా మంది ప్రజలు బతుకుతుంటారు. అటువంటి తాగునీటి చెరువులో కొందరు సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను కలిపారు. మొయినాబాద్ మున్సిపాలిటీ (Moinabad Municipality) పరిధిలో హిమాయత్ నగర్ సమీపంలో ఎఫ్టీఎల్ పాయింట్ నంబర్ 428 వద్ద చెరువులో సెప్టిక్ ట్యాంకర్ వ్యర్థాలను పారబోస్తుండగా స్థానికులు గమనించారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు.
Hyderabad | కేసు నమోదు
పెట్రోలింగ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సెప్టిక్ ట్యాంకర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. సైదాబాద్ ప్రాంతంలోని సింగరేణి కాలనీకి (Singareni Colony) చెందిన రామావత్ శివ నాయక్‌గా గుర్తించారు. అనంతరం వాటర్ బోర్డు ఎస్బీ ఉస్మాన్ నగర్ సెక్షన్ డీజీఎం నరహరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తాగునీటి చెరువులో వ్యర్థాలు కలుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కాగా.. సెప్టిక్ ట్యాంకర్‌కు అక్రమంగా వాటర్ బోర్డు, GHMC లోగో పెట్టుకున్నారని అధికారులు గుర్తించారు.
Hyderabad | ఇష్టారాజ్యంగా..
హైదరాబాద్ నగరంలో అనేక సెప్టిక్ ట్యాంకర్లు ఉన్నాయి. చాలా వరకు అనుమతి లేకుండానే నడిపిస్తున్నారు. వీరు ప్రజల నుంచి ఫోన్లు రాగానే సెప్టిక్ ట్యాంకులోని వ్యర్థాలను ట్యాంకర్లో నింపుకొని డబ్బులు తీసుకుంటున్నారు. అనంతరం ఆ వ్యర్థాలను చెరువులు, కుంటలు, అటవీ ప్రాంతాల్లో పారబోస్తున్నారు. చెరువుల్లో పారబోస్తే ఆ నీటితో ప్రజలకు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. మరోవైపు శివారు ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో వేస్తుండడంతో దుర్వాసన వస్తోంది.