అక్షరటుడే, కామారెడ్డి: Sensational Verdict of Kamareddy Court | కామారెడ్డి న్యాయస్థానం (Kamareddy Court) సంచలన తీర్పు వెలువరించింది. స్నేహితుడి కుటుంబానికి రుణం ఇప్పిస్తానని మోసం చేయడమే కాకుండా కుటుంబంలోని ఆరుగురిని హత్యచేసిన నిందితుడికి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది.
Sensational Verdict of Kamareddy Court | సదాశివనగర్‌లో కేసు..
వివరాల్లోకి వెళ్తే.. 2023 డిసెంబర్ 23న సదాశివనగర్ (Sadashiv nagar) మండలం భూంపల్లి గ్రామ శివారులో గుర్తు తెలియని మహిళను దహనం చేసారనే ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీ పుటేజీ, సాంకేతిక పరిజ్ఞానంతో ఓ కారును గుర్తించి కారు నంబర్ ఆధారంగా నిజామాబాద్ జిల్లా మాక్లూర్ గ్రామానికి చెందిన మెడిద ప్రశాంత్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా మరొక ఐదుగురిని హత్య చేసినట్టు తేలింది.
స్నేహితుడి ఇంటిని తనపై రిజిస్ట్రేషన్ చేసుకుని..
నిందితుడు ప్రశాంత్ తన స్నేహితుడైన పూణే ప్రసాద్ ఇంటిని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకుని రుణం ఇప్పిస్తానని ప్రసాద్‌ను నమ్మించాడు. నెలలు గడుస్తున్నా రుణం ఇప్పిచకపోవడంతో ఒకరోజు ప్రశాంత్‌ను నిలదీసి అడిగాడు. దాంతో కుటుంబ సభ్యులందరిని హత్య చేస్తే రుణం ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇల్లు కూడా తన సొంతం అవుతుందని ప్రశాంత్ భావించాడు. వెంటనే తన తమ్ముడు తేజ కిరణ్, మరొక వ్యక్తి గుగ్లోత్ విష్ణుకు విషయం చెప్పగా వారు సహకరిస్తామని చెప్పారు. నవంబర్ 29న విష్ణు తన స్నేహితుడైన బారోత్ వంశీకృష్ణను కూడా తోడుగా తీసుకుని రాగా అందరూ కలిసి ప్రసాద్‌ను మాక్లూర్ శివారులోని అడవిలోకి తీసుకెళ్లి హత్య చేసి అక్కడే గుంత తీసి పాతిపెట్టారు. మరుసటి రోజు ప్రసాద్ భార్య రమణి అలియాస్ శాన్వికను ప్రసాద్ రమ్మంటున్నాడని నమ్మించి కారులో తీసుకెళ్లి తాడుతో గొంతు బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని బాసర బ్రిడ్జిపై నుంచి నీటిలో పడేసి వెళ్లిపోయారు. అనంతరం ప్రసాద్ చిన్న చెల్లెలు శ్రావణిని అన్నా వదిన ఫలానా చోట ఉన్నారని మాచారెడ్డికి తీసుకుని వెళ్లి అక్కడినుంచి కారులో చేగుంట ప్రాంతానికి వెళ్లారు. అక్కడ శ్రావణిని హత్య చేసి పెట్రోల్ పోసి దహనం చేశారు.
డిసెంబర్ 5న ప్రసాద్ కవలపిల్లలు చైత్రిక, చేత్రికలను అమ్మానాన్నల వద్దకు వెళదామని బాసర వైపు తీసుకెళ్లి ఇద్దరిని తాడుతో గొంతు ఊపిరాడకుండా చేసి హత్యచేసి బ్రిడ్జిపై నుంచి పడేశారు. 13న ప్రసాద్ పెద్ద చెల్లెలు స్వప్నను హత్యచేసి భూంపల్లి శివారులో పెట్రోల్ పోసి దహనం చేసి కారులో వెళ్లిపోయారు. ఈ హత్యలన్నింటికీ ప్రసాద్ తల్లి ఒడ్డెమ్మ కూడా సహకరించింది. దాంతో పోలీసులు అందరిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కోర్టులో పోలీసులు సాక్ష్యాధారాలు సమర్పించగా ప్రధాన నిందితుడు ప్రశాంత్‌కు ఉరిశిక్షతో పాటు రూ.8వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ సంచలన తీర్పు చెప్పారు. అలాగే గుగ్లోత్ విష్ణు, ప్రశాంత్ తల్లి ఒడ్డెమ్మలకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. మరొక ఇద్దరు నిందితులైన తేజ కిరణ్, వంశీకృష్ణలు నేరం చేసిన సమయానికి మైనర్లు కావడంతో వారిపై విచారణ కొనసాగుతోంది.