అక్షరటుడే, వెబ్డెస్క్: HCA President | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Association) ఆది నుంచి వివాదాలకు కేంద్రంగానే ఉంది. అన్ని క్రికెట్ బోర్డులు క్రీడాకారులను తయారు చేస్తుంటే హెచ్సీఏ మాత్రం రాజకీయాలు, అక్రమాలకు నెలవుగా మారింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును టికెట్ల కోసం బెదిరించిన కేసులో హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు (HCA President Jaganmohan Rao)తో పాటు మరో నలుగురిని సీఐడీ పోలీసులు తాజాగా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు పొందరుపరిచారు.
HCA President | ఫోర్జరీ సంతకాలతో..
జగన్మోహన్‌రావు గౌలిపురా క్రికెట్ క్లబ్ (Goulipura Cricket Club) పేరును శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ పేరుగా మార్చారని సీఐడీ పేర్కొంది. శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ డాక్యుమెంట్స్ సంతకాలతో.. క్లబ్ యజమాని సంతకాలు సరిపోలడం లేదని రిపోర్టులో పొందుపరిచింది. నకిలీ పత్రాలతోనే జగన్మోహన్ రావు క్లబ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. గౌలిపుర క్రికెట్ క్లబ్ బీఎన్ అధ్యక్షుడు కృష్ణ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన జగన్మోహన్ రావు.. దాని ద్వారా శ్రీచక్ర క్లబ్ (Sri Chakra Cricket Club) ఏర్పాటు చేశారు. ఆ క్లబ్ ద్వారా హెచ్సీఏ అధ్యక్షుడిగా పోటీ చేసి గెలుపొందడం గమనార్హం.
HCA President | బీసీసీఐ నిధులు దుర్వినియోగం
హెచ్సీఏలో భారీగా అక్రమాలు జరిగినట్లు సీఐడీ గుర్తించింది. HCAలో నెలకొన్న అక్రమాలు, తప్పుడు పద్ధతులు, నిధుల దుర్వినియోగాన్ని సీఐడీ (CID Telangana) వెలుగులోకి తీసుకొచ్చింది. బీసీసీఐ నిధులను సైతం దుర్వినియోగం చేసినట్లు గుర్తించింది. కాగా.. వైద్య పరీక్షల అనంతరం జగన్మోహన్రావును మల్కాజ్‌గిరి కోర్టులో (Malkajgiri Court) హాజరు పరిచారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది.