అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kurnool Bus Accident | కర్నూల్ జిల్లాలో బస్సు కాలిపోయిన ఘటన అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు (Vemuri Kaveri Travels Bus) దగ్ధమైన విషయం తెలిసిందే.
బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలువురు ప్రాణాలతో బయటపడగా.. 20 మంది వరకు చనిపోయినట్లు తెలిసింది. ఇప్పటికే పోలీసులు 19 మంది మృతదేహాలను వెలికితీశారు. అయితే ప్రమాదానికి గురైన బస్సుపై తెలంగాణ (Telangana) లో 16 చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి.
Kurnool Bus Accident | నో ఎంట్రీ జోన్లోకి..
ప్రమాదానికి గురైన వేమురి కావేరి ట్రావెల్స్ బస్సు DD01 N9490 నంబర్‌తో రిజిస్టర్ అయింది. ఈ బస్సుపై రూ.23,120 ఫైన్లు పెండింగ్‌లో ఉన్నాయి. 2024 జనవరి 27 నుంచి 2025 అక్టోబరు 9 వరకు 16 సార్లు ఈ బస్సు ట్రాఫిక్ నిబంధనలను (Traffic Rules) ఉల్లంఘించింది. ఇందులో నో ఎంట్రీ జోన్లోకి వెళ్లడంతో పాటు డేంజరస్ డ్రైవింగ్ ఫైన్లు కూడా ఉన్నాయి. అలాగే నో పార్కింగ్‌లో నిలిపినందుకు సైతం చలాన్లు వేశారు.
Kurnool Bus Accident | ఫిట్‌గానే ఉంది
ప్రమాదానికి గురైన బస్సు ఫిట్‌గానే ఉందని రవాణా శాఖ అధికారులు తెలిపారు. బైక్‌ను బలంగా ఢీకొట్టడంతోనే మంటలు వచ్చాయని వెల్లడించారు. ఆ బస్సుకు 2030 ఏప్రిల్ 30 వరకు టూరిస్ట్ పర్మిట్ జారీ ఉందని, 2027 మార్చి 31 వరకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ సైతం ఉందని వెల్లడించారు. 2026 ఏప్రిల్ 20 వరకు ఇన్సూరెన్స్ కూడా ఉందని తెలిపారు.
Kurnool Bus Accident | పరిహారం ప్రకటించిన మోదీ
కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ (Prime Minister Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ. 50 వేల తక్షణ సాయం అందిస్తామని ప్రకటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) సైతం ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Kurnool Bus Accident | కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
బస్సు ప్రమాదం ఘటనపై ప్రభుత్వం కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. కర్నూలు కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ నంబర్ 08518-277305, కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూమ్ నంబర్ 9121101059, ఘటనా స్థలి వద్ద కంట్రోల్ రూమ్ నంబర్ 9121101061, పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నంబర్ 9121101075, కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి హెల్ప్ డెస్క్ నంబర్లు 9494609814, 9052951010 ఏర్పాటు చేసింది. ఆ బస్సుల్లో ప్రయాణించిన వారి కుటుంబ సభ్యులు, బంధువులు వివరాల కోసం ఆయా నెంబర్లకు ఫోన్ చేయొచ్చని అధికారులు తెలిపారు.

