అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Shrusti Clinic Case | సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ అక్రమాలు తవ్వే కొద్ది బయటకు వస్తున్నాయి. డాక్టర్ నమ్రత (Doctor Namratha ) మోసాలు చూసి పోలీసులే షాక్ అవుతున్నారు. సరోగసి (Surrogacy) పేరిట దంపతులను మోసం చేస్తున్న సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సెంటర్ యజమాని డాక్టర్ నమ్రతతో పాటు, పలువురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో నమ్రతను ఐదు రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించగా.. సంచలన విషయాలు వెలుగు చూశాయి.
డాక్టర్ నమ్రత ఇప్పటి వరకు సరోగసి పేరుతో 80 మంది పిల్లల విక్రయించింది. పిల్లలను అమ్ముకున్నట్టు ఆమె అంగీకరించింది. వేర్వేరు ప్రాంతాల నుంచి పిల్లలను సేకరించామని తెలిపింది. అందరికీ డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశామని తెలిపింది. అయితే ఏజెంట్ల వివరాలు మాత్రం నమ్రత పోలీసులకు చెప్పలేదు. దీంతో 80 మంది పిల్లల తల్లిదండ్రుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె ఐదు రోజుల కస్టడీ ముగియంతో మళ్లీ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు.
Shrusti Clinic Case | వైద్య శిబిరాల పేరిట..
డాక్టర్ నమ్రత ఏపీ (AP)లోని పలు మారుమూల గ్రామాల్లో వైద్య శిబిరాలు (Health Camps) నిర్వహించేది. అక్కడ పేద దంపతులను గుర్తించి.. వారి ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని బిడ్డలను కొనుగోలు చేసేది. నమ్రతకు పలువురు ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు కూడా సహకరించేవారు. తల్లిదండ్రులకు రూ.లక్ష నుంచి రూ.4 నాలుగు లక్షల వరకు చెల్లించేది. అనంతరం ఆ బిడ్డలను తన దగ్గరకు పిల్లలు లేరని వచ్చిన వారికి సరోగసి పేరిట అప్పగించేది. వారి నుంచి రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వసూలు చేసింది.
Shrusti Clinic Case | పిల్లలను అమ్మే గ్యాంగులతో లింకులు
డాక్టర్ నమ్రతకు పిల్లలను అమ్మే గ్యాంగులతో సైతం లింకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మహారాష్ట్ర, అహ్మదాబాద్, ఆంధ్రకు చెందిన ముఠాల నుంచి ఆమె పిల్లలను కొనుగోలు చేసేది. పిల్లల కాలేదని ఐవీఎఫ్ (IVF) కోసం వచ్చే దంపతులను ఆమె సరోగసి వైపు మళ్లించేది. అనంతరం కొనుగోలు చేసిన బిడ్డలను వారికి ఇచ్చి మోసాలకు పాల్పడింది.
నందిని, హర్ష, పవన్ అనే వ్యక్తుల నుంచి నమ్రత పిల్లలను కొనుగోలు చేసేది. వీరు హైదరాబాద్‌లోని మరో నాలుగు సెంటర్లకు కూడా పిల్లల్ని అమ్మినట్టు పోలీసులు గుర్తించారు. ఈ గ్యాంగ్ యువతను సైతం ట్రాప్ చేస్తోంది. వీర్యకణాలు, అండాలను సేకరించి విక్రయిస్తోంది. నమ్రత ఈ గ్యాంగ్‌కు పెద్ద ఎత్తున డబ్బులు ముట్టజెప్పినట్లు గుర్తించారు.