అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Metro | తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రోను స్వాధీనం చేసుకోనుంది.
నగరంలోని మెట్రో నిర్వహణ బాధ్యతను ప్రస్తుతం ఎల్అండ్టీ (LT) సంస్థ చూస్తున్న విషయం తెలిసిందే. అయితే నష్టాల్లో ఉన్న మెట్రోను నడపలేమని ఇటీవల ఎల్అండ్టీ కేంద్రానికి లేఖ రాసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కీలకంగా భావిస్తున్న మెట్రో రెండో దశలో (Metro Phase 2) భాగస్వామ్యం కావడానికి ఆ సంస్థ ఒప్పుకోవడం లేదు. దీంతో మెట్రో స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Hyderabad Metro | రుణాన్ని స్వీకరించనున్న ప్రభుత్వం
ఎల్అండ్టీ మెట్రో రైలు హైదరాబాద్ లిమిటెడ్ (LTMRHL) రూ.13 వేల కోట్ల రుణాన్ని ప్రభుత్వం స్వీకరించనుంది. ఆ సంస్థకు ఒకసారి ఈక్విటీ సెటిల్‌మెంట్‌గా రూ.రెండు వేల కోట్లు చెల్లించనుంది. మెట్రో రెండో దశ విస్తరణను ప్రాసెస్ చేయడానికి ఇది మార్గం సుగమం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. టేకోవర్ షరతులు చట్టబద్ధమైన సమ్మతితో రూపొందించనున్నారు. ఎల్ అండ్ టీ ప్రారంభంలో LTMRHL రుణాన్ని (రూ.13వేల కోట్లు) స్వాధీనం చేసుకోవాలని, రూ.5,900 కోట్ల ఈక్విటీని చెల్లించాలని కోరింది. అయితే తెలంగాణ ప్రభుత్వం రూ.2 వేల కోట్లు ఎల్ అండ్ టీ ఈక్విటీకి ఇవ్వడానికి ఓకే చెప్పింది.
Hyderabad Metro | సీఎం కీలక సమావేశం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ప్రభుత్వ సీనియర్ అధికారులతో కలిసి గురువారం ఎల్ అండ్ టీ గ్రూప్ సీఎండీ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్, సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. తదుపరి చర్యలపై చర్చించారు.
Hyderabad Metro | కేంద్రం ఒత్తిడితో..
హైదరాబాద్ (Hyderabad), పరిసర ప్రాంతాలలో పెరుగుతున్న ప్రజా రవాణా డిమాండ్‌ను తీర్చడానికి తెలంగాణ ప్రభుత్వం మెట్రోను విస్తరించాలని నిర్ణయించింది. రెండో దశ పనులు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. అయితే మొదటి నిర్వహణ ఎల్టీ సంస్థ చూసుకుంటోంది. ఈ క్రమంలో ఎల్అండ్టీతో ఒప్పందం చేసుకోవాలని కేంద్రం గతంలో సూచించింది. దీనికి సదరు సంస్థ ఒప్పుకోలేదు. అంతేగాకుండా హైదరాబాద్ మెట్రోలోని తమ వాటాను ఇతరులకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా ఎల్అండ్టీ నుంచి మెట్రో నిర్వహణ బాధ్యతలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కేంద్రం రెండో దశ మెట్రోకు అనుమతులు ఇవ్వడానికి మార్గం సుగుమం అయింది.