అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్ల నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐ బొమ్మ వెబ్ సైట్ సంచలన ప్రకటన విడుదల చేసింది. తమ సేవలను శాశ్వతంగా నిలిపివేశామని వెబ్సైట్లో వెల్లడించింది. తన వెబ్సైట్లో ఇలా రాసుకొచ్చింది. ఐబొమ్మ వెబ్‌సైట్ ప్రకారం.. ‘ఈ మధ్య కాలంలో మా గురించి వినే ఉండొచ్చు. మీరు మా విశ్వసనీయ అభిమానిగా ఉన్నారు.. కానీ ఇప్పుడు మేం మా సేవలను మీ దేశంలో నిలిపి వేస్తున్నాం.. ఇందుకు మేం చింతిస్తున్నాం.. అందుకు క్షమాపణలు కోరుతున్నాం’ అని పేర్కొంది.
Ibomma | పోలీసులకు సవాల్ చేసి.. కటకటాల పాలు
ఐ బొమ్మ నిర్వాహకుడు గతంలో దమ్ముంటే పట్టుకోండంటూ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. దీనిని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు తాజాగా నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేశారు. అనంతరం అతడితో వెబ్‌సైట్‌ను డిలీట్ చేయించారు.
కాగా.. రవి అరెస్ట్ వివరాలను సీపీ సజ్జనార్ వెల్లడించారు. రవి ఒక వెబ్‌సైట్ బ్లాక్ చేస్తే మరోటి మిర్రర్ చేసేవాడని తెలిపారు. దాదాపు 65 మిర్రర్ సైట్లు నిర్వహించాడని సీపీ తెలిపారు. ఆయన హార్డ్ డిస్క్‌లను విశ్లేషించిన తర్వాత 21 వేల సినిమాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. 1972లో విడుదలైన గాడ్‌ఫాదర్ నుంచి మొన్న రిలీజ్ అయిన ఓజీ వరకు ఆయన హార్డ్ డిస్క్‌లో ఉన్నాయని చెప్పారు. ఐ బొమ్మ సైట్ ద్వారా రూ.20 కోట్లు సంపాదించినట్లు రవి చెప్పాడన్నారు. తాము రూ.3 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఆయనను పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ కేసులో అంతర్జాతీయ లింక్‌లు ఉన్నాయన్నారు.
Ibomma | ప్రజల డేటా దుర్వినియోగం
రవి వద్ద 50 లక్షల మంది ప్రజల డేటా ఉందని సీపీ తెలిపారు. ఈ డేటాను డార్క్‌వెబ్‌లో పెడుతున్నారని తెలిపారు. ఈ డేటాను మిస్‌యూజ్ చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. దీని వెనుక పెద్ద రాకెట్ ఉందన్నారు. ఇలాంటి వెబ్సైట్లను ప్రజలు ఎంకరేజ్ చేయొద్దని కోరారు. వీటిని ఓపెన్ చేస్తే ప్రజల డేటా మొత్తం వారి చేతుల్లోకి వెళ్తుందన్నారు. దీనిని దుర్వినియోగం చేస్తారని హెచ్చరించారు.
