అక్షరటుడే, వెబ్డెస్క్: Actress Saroja Devi | కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao)మృతి చెందడంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణం గురించి మరిచిపోకముందే భారత సినిమా చరిత్రలో చిరస్మరణీయ పాత్రలు పోషించిన ప్రముఖ సీనియర్ నటి బీ సరోజా దేవి(Actress B. Saroja Devi) కన్నుమూశారు. వృద్ధాప్యంతో పాటు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, బెంగళూరులోని యశవంతపురలో ఉన్న మణిపాల్ ఆస్పత్రి(Manipal Hospital)లో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 9 గంటల సమయంలో (జూలై 15) తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 87 ఏళ్లు.
Actress Saroja Devi | ఏడు దశాబ్దాల సినీ ప్రయాణం..
1938 జనవరి 7న బెంగళూరు(Bangalore)లో జన్మించిన సరోజా దేవి, అత్యంత చిన్న వయసులోనే సినిమాలపై ఆసక్తి కనబరిచారు. అప్పట్లో 13 ఏళ్లకే సినిమా అవకాశాలు వచ్చినా వాటిని తిరస్కరించారు. 1955లో ‘మహాకవి కాళిదాసు’ సినిమాతో చిత్రపరిశ్రమ (Film Industry)లోకి అడుగుపెట్టి, తొలి ప్రయత్నానికే ఘన విజయం సాధించారు. అలాగే 1957లో ‘పాండురంగ మహత్యం’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆపై కన్నడ, తమిళ, తెలుగు, హిందీ, మలయాళం ఇలా పలు భాషలలో, అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు. 70 ఏళ్ల సినీ జీవితంలో సుమారు 200కి పైగా సినిమాల్లో నటించారు.
1985లో ‘లేడీస్ హాస్టల్’ సినిమా షూటింగ్ సమయంలో ఆమె భర్త తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. 1986లో ఆయన మరణంతో సరోజా దేవి తీవ్ర దిగ్బ్రాంతిలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు పూర్తిగా సినిమాల నుంచి తప్పుకున్నారు. కుటుంబ సభ్యులు తప్ప ఎవ్వరినీ కలవలేదు.1987లో మళ్లీ సినిమాల్లోకి తిరిగి వచ్చారు.
ఒప్పందాల మేరకు కొన్ని చిత్రాల్లో మాత్రమే నటించారు. భర్త మరణం తర్వాత కొత్త సినిమాలు సైన్ చేయలేదు. అయితే అభిమానులు, నిర్మాతల ఒత్తిడితో ఐదేళ్ల విరామం తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. సరోజా దేవి చివరిసారిగా 2019లో ‘నటసార్వభౌమ’ అనే కన్నడ సినిమాలో నటించారు. సరోజా దేవి మృతి వార్తతో తెలుగు, తమిళ, కన్నడ సినీ పరిశ్రమల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె సినీ సేవలు, నటనా ప్రతిభ గురించి పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేస్తున్నారు. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ వంటి హీరోలతో పని చేసింది సరోజా దేవి.