అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Markets | రష్యానుంచి చమురు కొనుగోళ్లను ఆపకపోతే కొత్త సుంకాలను (New tariffs) విధిస్తామన్న అమెరికా అధ్యక్షుడి ప్రకటనకు తోడు రిలయన్స్(Reliance) సంస్థ రష్యానుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తోందంటూ బ్లూమ్‌బర్గ్‌లో ప్రచురితమైన కథనంతో ఆయిల్ కంపెనీలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి.
ఇంట్రాడేలో రిలయన్స్ సుమారు 4.5 శాతం పతనమైంది. క్యూ3 అప్డేట్స్ నిరాశపరచడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్(HDFC bank) 1.5 శాతానికన్నా ఎక్కువ నష్టపోయింది. దీంతోపాటు కంపెనీల మూడో త్రైమాసిక ఆర్థిక నివేదికల ప్రకటనలకు ముందు ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తుండడం, ప్రాఫిట్ బుకింగ్‌కు దిగుతుండడంతో దేశీయ స్టాక్ మార్కెట్ అమ్మకాల ఒత్తిడికి గురవుతోంది.
మంగళవారం ఉదయం సెన్సెక్స్ 108 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 324 పాయింట్లు కోల్పోయింది. కనిష్టాల వద్ద లభించిన మద్దతుతో పుంజుకుని 390 పాయింట్లు ఎగబాకినా.. నిలదొక్కుకోలేక అక్కడినుంచి 497 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ(Nifty) 61 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 45 పాయింట్లు పడిపోయింది. అక్కడినుంచి కోలుకుని 129 పాయింట్లు పెరిగినా గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్‌తో మళ్లీ 149 పాయింట్లు నష్టపోయింది. చివరికి సెన్సెక్స్(Sensex) 376 పాయింట్ల నష్టంతో 85,063 వద్ద, నిఫ్టీ 71 పాయింట్ల నష్టంతో 26,178 వద్ద స్థిరపడ్డాయి.
Stock Markets | రాణిస్తున్న పీఎస్‌యూ బ్యాంకులు..
పీఎస్‌యూ బ్యాంకింగ్ స్టాక్స్(PSU banking stocks) విశేషంగా రాణిస్తున్నాయి. ఆర్బీఐ రెపో రేట్లను తగ్గిస్తుండడం, మెరుగైన క్రెడిట్ గ్రోత్ అంచనాలు, బలమైన త్రైమాసిక పనితీరుపై అంచనాలతో ఏడు సెషన్లుగా లాభాల బాటలో సాగుతున్నాయి. దీంతో నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ రికార్డ్ స్థాయి గరిష్టాలకు చేరింది.
Stock Markets | ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లలో..
బీఎస్ఈలో ఎనర్జీ(Energy) ఇండెక్స్ 1.71 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.22 శాతం, సర్వీసెస్ 1.07 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.63 శాతం, ఇండస్ట్రియల్ 0.52 శాతం, ఇన్ఫ్రా 0.50 శాతం, యుటిలిటీ 0.44 శాతం నష్టపోయాయి. హెల్త్‌కేర్ 1.38 శాతం, క్యాపిటల్ మార్కెట్ 0.71 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 0.52 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్ ఇండెక్స్ 0.43 శాతం, ఐటీ ఇండెక్స్ 0.35 శాతం లాభపడ్డాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.39 శాతం లాభం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.24 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.17 శాతం నష్టంతో ముగిశాయి.
Stock Markets | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,659 కంపెనీలు లాభపడగా 2,521 స్టాక్స్ నష్టపోయాయి. 169 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 143 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 125 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 9 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 8 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Stock Markets | Top gainers..
బీఎస్ఈ సెన్సెక్స్‌లో 16 కంపెనీలు లాభపడగా.. 14 కంపెనీలు నష్టపోయాయి. ఐసీఐసీఐ బ్యాంక్ 2.87 శాతం, సన్‌ఫార్మా 1.73 శాతం, హెచ్‌యూఎల్ 1.52 శాతం, ఎస్బీఐ 1.33 శాతం, టీసీఎస్ 1.28 శాతం లాభపడ్డాయి.
Stock Markets | Top losers..
ట్రెంట్ 8.62 శాతం, రిలయన్స్ 4.42 శాతం, ఐటీసీ 2.07 శాతం, కొటక్ బ్యాంక్ 2.02 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.56 శాతం నష్టపోయాయి.