అక్షరటుడే, వెబ్డెస్క్ : JP Nadda | బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా మీటింగ్లో ఓ సెక్యూరిటీ గార్డు స్పృహ తప్పి కింద పడిపోయాడు. ఈ ఘటన గుజరాత్ (Gujarat)లో చోటు చేసుకుంది.
గుజరాత్లోని వడోదరలో (Vadodara) జేపీ నడ్డా శనివారం పర్యటించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకల్లో భాగంగా కరమ్సద్ నుంచి ప్రారంభమైన ‘సర్దార్ @ 150 రాష్ట్రీయ ఏక్తా యాత్ర’ శనివారం వడోదర నగరంలోకి ప్రవేశించింది. నగరంలోని వివిధ నివాస సంఘాలు, సంస్థలు మరియు మతపరమైన సంస్థలు యాత్రను ఉత్సాహంగా స్వాగతించాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో నడ్డా మాట్లాడారు. ఆయన ప్రసంగిస్తుండగా.. సెక్యూరిటీ గార్డు (Security Guard) అకస్మత్తుగా కింద పడిపోయాడు. అయినా కానీ ఆయన పట్టించుకోకుండా.. తన ప్రసంగాన్ని కొనసాగించారు. వేదికపై ఉన్న మిగతా నేతలు సైతం కనీసం స్పందించలేదు. ఇతర సెక్యూరిటీ సిబ్బంది, ఓ ఫొటోగ్రాఫర్ అప్రమత్తమై ఆయనను ఆస్పత్రికి తరలించారు.
JP Nadda | ఎక్కువ సేపు నిలబడడంతో..
స్పృహ తప్పి పడిపోయిన గార్డు రైల్వే, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టుకు అనుబంధంగా ఉన్నట్లు సమాచారం. ఎక్కువసేపు నిలబడడంతో శారీరక అసౌకర్యం కారణంగా గార్డు కళ్లు తిరిగి పడిపోయినట్లు తెలుస్తోంది. ఇతర భద్రతా సిబ్బంది వెంటనే అతన్ని వైద్య సహాయం కోసం సమీపంలోని ఒక సదుపాయానికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.
JP Nadda | నడ్డా తీరుపై విమర్శలు
ఓ గార్డు కింద పడిపోయినా పట్టించుకోకుండా.. జేపీ నడ్డా ప్రసంగం కొనసాగించడంపై సోషల్ మీడియాలో (Social Media) నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఆయనను ఆస్పత్రికి తీసుకు వెళ్లాలని కూడా నడ్డా చెప్పకపోవడం గమనార్హం. వేదికపై ఉన్న నాయకుల తీరుపై సైతం మండిపడుతున్నారు. కింద పడిపోయిన వ్యక్తిని పట్టించుకోకుండా అలాగే ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనిషి ప్రాణాల కంటే ప్రసంగాలు ఎక్కువా అని ప్రశ్నిస్తున్నారు.