HomeUncategorizedParliament Security | పార్ల‌మెంట్ వ‌ద్ద భ‌ద్ర‌తా వైఫ‌ల్యం.. గోడ‌దూకి చొర‌బ‌డ్డ ఆగంత‌కుడు

Parliament Security | పార్ల‌మెంట్ వ‌ద్ద భ‌ద్ర‌తా వైఫ‌ల్యం.. గోడ‌దూకి చొర‌బ‌డ్డ ఆగంత‌కుడు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Parliament Security | పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం మరోసారి బ‌య‌ట ప‌డింది. ఓ ఆగంతకుడు గోడ దూకి పార్లమెంట్ భవనంలోకి చొరబడ్డాడు. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై.. అతడిని అదుపులోకి తీసుకుంది.

దేశంలో అత్యంత రక్షిత ప్రభుత్వ సముదాయాలలో ఒకటైన పార్ల‌మెంట్‌లోకి (Parliament) శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి రైల్ భవన్ సమీపంలోని ఒక చెట్టు సహాయంతో గోడ దూకి పార్లమెంట్​ ప్రాంగణంలోకి చొరబడ్డాడు. ఉదయం 6:30 గంటల ప్రాంతంలో చొరబాటుదారుడు సరిహద్దు గోడను దాటి దూకి కొత్తగా నిర్మించిన పార్లమెంట్​ భవనం గరుడ ద్వారం (Garuda Gate) వద్దకు చేరుకున్నాడు. భద్రతా సిబ్బంది (Security Staff) వెంట‌నే స్పందించి అనుమానితుడిని పట్టుకున్నారు. అతడు ఎవ‌రు, ఎందుకు వ‌చ్చాడు, బహుళ స్థాయిల భద్రతను అతను ఎలా తప్పించుకున్నాడ‌నే అంశాల‌పై విచార‌ణ జ‌రుపుతున్నారు.

Parliament Security | గ‌తంలోనూ ఇలాగే..

ఇటీవలి కాలంలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే తొలిసారి కాదు. గత సంవత్సరం కూడా ఇలాగే ఒక వ్యక్తి గోడ దూకి అనెక్స్ భవన ప్రాంగణంలోకి ప్రవేశించాడు. ఆ సంఘటనకు సంబంధించిన వీడియోలో.. నిందితుడిని సాయుధ CISF సిబ్బంది పట్టుకున్నట్లు చూపించారు. తనిఖీ చేస్తున్నప్పుడు అతని వద్ద ఎటువంటి అనుమానిత పదార్థాలు కనిపించలేదు. ఇక‌, 2023లో జరిగిన మ‌రో నాటకీయ ప‌రిణామం చోటు చేసుకుంది. లోక్‌స‌భ స‌మావేశాలు (Lok Sabha Sessions) జ‌రుగుతుండ‌గానే ఇద్దరు వ్యక్తులు సందర్శకుల గ్యాలరీ నుంచి స‌భ‌లోకి దూకారు. ఎల్లో క్యాన్‌స్ట‌ర్ల ద్వారా ప‌సుపు రంగు పొగ‌ను విర‌జిమ్ముతూ నినాదాలు చేశారు. ఈ ఘ‌ట‌న అప్ప‌ట్లో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన భ‌ద్ర‌తా సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితులు లక్నోకు చెందిన సాగర్ శర్మ (25), మైసూరుకు చెందిన మనోరంజన్ డి (35)గా గుర్తించారు.
తాజాగా శుక్రవారం జరిగిన ఉల్లంఘన మరోసారి పార్లమెంటు భద్రతా యంత్రాంగంలోని లోపాల‌ను వెలుగులోకి వచ్చింది. అధికారులు CCTV ఫుటేజ్‌లను సమీక్షిస్తున్నారు. అలాగే ఏవైనా భ‌ద్రతా లోపాలు ఉన్నాయా దానిపై దృష్టి సారించారు.

Parliament Security | వాయిదాల ప‌ర్వం..

పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు ముగిసిన ఒక రోజు తర్వాత ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. జూలై 21న ప్రారంభమైన వ‌ర్షాకాల సమావేశంలో 21 రోజులు పాటు కొన‌సాగాయి. కానీ విప‌క్షాల ఆందోళ‌న‌ల‌తో స‌భా కార్య‌క‌లాపాలు త‌ర‌చూ వాయిదా ప‌డ్డాయి. కేవ‌లం 37.07 గంటలు మాత్రమే శాసన వ్యవహారాలు సాగాయని లోక్‌సభ సెక్రటేరియట్ తెలిపింది.