అక్షరటుడే, బోధన్: Bodhan MLA | పల్లెల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శులు క్రియాశీలక పాత్ర పోషించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి (Bodhan MLA P. Sudarshan Reddy) సూచించారు. పట్టణంలోని లయన్స్ భవన్లో బుధవారం బోధన్ నియోజకవర్గ స్థాయి పంచాయతీ కార్యదర్శుల (Panchayat secretaries) పనితీరు, విధులు, బాధ్యతల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి (Collector T. Vinay Krishna Reddy), సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Sub-Collector Vikas Mahato) తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. పల్లెల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా పల్లెల ప్రగతి కోసం పంచాయతీ కార్యదర్శులు అంకిత భావంతో కృషి చేయాలన్నారు. అలసత్వ వైఖరిని ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Bodhan MLA | పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలి
పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. గ్రామ పంచాయతీకి (Gram Panchayat) సరిపడా నిధులు సమకూర్చుకున్నప్పుడే మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. సుదీర్ఘ కాలం నుంచి పన్నులు చెల్లించని వారికి నోటీసులు జారీ చేసి, నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మార్చి నెలాఖరు నాటికి అన్ని పంచాయతీల పరిధిలో నూటికి నూరు శాతం పన్ను వసూళ్లు జరగాలన్నారు. పన్ను వసూళ్లలో వెనుకబడి ఉన్న పంచాయతీల కార్యదర్శులకు నోటీసులు జారీ చేసి వివరణ కోరాలని డీపీవోను ఆదేశించారు. సుదీర్ఘ కాలం నుంచి ఒకేచోట విధులు నిర్వర్తిస్తున్న వారికి బదిలీలు చేపట్టాలని సూచించారు. పనితీరు సక్రమంగా లేని వారిని ఎంతమాత్రం ఉపేక్షించకూడదన్నారు. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా సేవలు అందించాలని సూచించారు.
Bodhan MLA | పల్లెల్లో స్పష్టమైన మార్పు కనిపించాలి
ప్రతి పల్లెలో స్పష్టమైన మార్పు కనిపించేలా కార్యదర్శులు పని చేయాలని సుదర్శన్ రెడ్డి సూచించారు. ప్రజలకు కనీస మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. ముఖ్యంగా వీధి దీపాలు, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, మురికి కాల్వలు క్రమం తప్పకుండా శుభ్రం చేయించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
Bodhan MLA | గ్రామాల్లో పరిశుభ్రంగా ఉండాలి
గ్రామాల్లో పరిశుభ్రతతో కూడిన ఆహ్లాదకర వాతావరణం నెలకొనేలా పచ్చదనాన్ని పెంపొందించాలని ప్రభుత్వ సలహాదారు సూచించారు. ప్రజల ఆరోగ్యాల పరిరక్షణకు పాటుపడాలన్నారు. క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తూ, అందరితో సమన్వయాన్ని పెంపొందించుకోవాలన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చొరవ చూపాలని చెప్పారు. పల్లెల సమగ్రాభివృద్ధికి నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుని తదనుగుణంగా కార్యాచరణతో ముందుకెళ్లాలని మార్గనిర్దేశం చేశారు. సకాలంలో అనుమతులు మంజూరు చేస్తూ, ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారించాలని సూచించారు.
Bodhan MLA | సమీక్షకు హాజరు కాని వారిపై చర్యలు
కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ సమీక్షా సమావేశానికి గైర్హాజరైన కార్యదర్శుల గురించి వాకబు చేశారు. ముందస్తు అనుమతి తీసుకోకుండా సమీక్షకు హాజరు కాని వారిపై చర్యలు తీసుకోవాలని డీపీవోను ఆదేశించారు. ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు వంద శాతం పన్ను వసూలు చేయాలని పేర్కొన్నారు. పన్ను వసూళ్ల వివరాలను వెనువెంటనే ఆన్లైన్లో పొందుపర్చాలన్నారు. పన్ను వసూళ్ల ప్రగతిని తాను స్వయంగా సమీక్షిస్తానని, నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. సమావేశంలో డీపీవో శ్రీనివాస్ రావు, బోధన్ డీఎల్పీవో నాగరాజు, ఆయా మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు.