అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cabinet Expansion | తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion) అంశం ఒక్క అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) కొలువుదీరి ఏడాదిన్నర కావొస్తున్నా.. ఇప్పటి వరకు కేబినెట్ విస్తరణ చేపట్టలేదు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవి ఆశిస్తుండటంతో అధిష్టానం మంత్రివర్గ విస్తరణను వాయిదా వేస్తూ వస్తోంది.
సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ (PCC Chief Mahesh) ఇటీవల ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal)తో సమావేశం అయ్యారు. మంత్రివర్గ విస్తరణ, రాష్ట్ర కార్యవర్గ అంశంపై వారు చర్చించారు. దీంతో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌లోని మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు(Madiga Community MLA’s) రహస్యంగా భేటీ కావడం చర్చకు దారి తీసింది.
Cabinet Expansion | తమకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్
ప్రస్తుతం రాష్ట్రంలో 11 మంది మంత్రులు ఉన్నారు. మరో ఆరు మంత్రి పదవి పోస్టులు(Minister Posts) ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న వారిలో రెడ్డి సామాజిక వర్గం నుంచి ముగ్గురు, వెలమ కులానికి చెందిన ఇద్దరు మంత్రివర్గంలో ఉన్నారు. బ్రాహ్మణ కులం నుంచి ఒకరు, బీసీ సామాజిక వర్గం నుంచి ఇద్దరు కేబినెట్లో ఉన్నారు. ఎస్టీ కులం నుంచి సీతక్క, ఎస్సీ కోటాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఇద్దరికి మంత్రి పదవి వచ్చినా.. మాదిగ సామాజిక వర్గం నుంచి కేవలం దామోదర రాజనర్సింహ మాత్రం మంత్రివర్గంలో ఉన్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ మాదిగ సామాజికవర్గ ఎమ్మెల్యేలు మంగళవారం రహస్యంగా భేటీ కావడం చర్చకు దారితీసింది. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, తుంగతుర్తి ఎమ్మెల్యే సామెల్ ఈ మీటింగ్ కు హాజరైనట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో మాల సామాజిక వర్గానికి చెందిన వివేక్ కుమారుడు గడ్డం వంశీ, మల్లు రవి అవకాశం ఇవ్వగా.. వారిద్దరూ ఎంపీలుగా గెలిచారు. 17 ఎంపీ స్థానాలు ఉండగా.. ఇందులో మూడు ఎస్సీ రిజర్వ్డ్. వీటిలో ఎక్కడా మాదిగలకు అవకాశం ఇవ్వకపోవడంపై ఆ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ సమయంలోనూ అన్యాయం చేశారని వారి ఆవేదన. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో ఎలాగైనా.. తమ సామాజిక వర్గం నుంచి ఒకరికి చోటు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఎస్సీ కోటాలో వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఖాయం అనే వార్తలు వస్తున్నాయి. ఆయన కూడా మాల సామాజిక వర్గానికి చెందిన వారే. ఈ క్రమంలో మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు తమలో ఒకరికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు వారు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌తో (Meenakshi Natarajan) ఫోన్‌లో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. బుధవారం ఆమెను కలిసి మంత్రి పదవులపై చర్చించనున్నట్లు సమాచారం. అధిష్ఠానంపై ఒత్తిడి పెంచేందుకు వారు నిర్ణయించుకున్నారు.
Cabinet Expansion | ఈ సారైనా విస్తరణ ఉంటుందా!
కాంగ్రెస్ అధిష్టానం మంత్రివర్గ విస్తరణకు ఏప్రిల్‌లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తీరా పదవులు ఇచ్చే సమయంలో పలువురు నాయకులు అడ్డుకున్నట్లు ప్రచారం జరిగింది. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి లేఖ రాయడంతో మంత్రి పదవుల భర్తీ ఆగిపోయిందని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు అధిష్టానంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించడంతో.. ఈ సారైనా విస్తరణ ఉంటుందా.. లేక హైకమాండ్ మరోసారి వాయిదా వేస్తుందా అనేది తేలాల్సి ఉంది.