HomeUncategorizedPakistan Spy | పాక్‌కు ర‌హ‌స్య స‌మాచారం చేర‌వేత.. ఐఎస్ఐతో సంబంధాలున్న‌ సైనికుడి అరెస్టు..

Pakistan Spy | పాక్‌కు ర‌హ‌స్య స‌మాచారం చేర‌వేత.. ఐఎస్ఐతో సంబంధాలున్న‌ సైనికుడి అరెస్టు..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Pakistan Spy | పాకిస్తాన్ నిఘా సంస్థ ISIతో ముడిపడి ఉన్న గూఢచర్య దర్యాప్తులో కీల‌క పరిణామం చోటు చేసుకుంది. ర‌హ‌స్య స‌మాచారాన్ని శత్రు దేశానికి చేర‌వేస్తున్న సైనికుడిని అరెస్టు చేశారు. రహస్య సైనిక సమాచారాన్ని(Military Information) లీక్ చేయడంలో సహాయం చేశాడనే ఆరోపణలతో ఆర్మీలో ప‌ని చేస్తున్న‌ దేవిందర్ సింగ్‌ను పంజాబ్ పోలీసుల రాష్ట్ర ప్రత్యేక ఆపరేషన్ సెల్ (SSOC) అరెస్టు చేసింది. జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా(Baramulla District)లోని ఉరిలో అత‌డ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదే కేసులో గతంలో అరెస్టయిన మాజీ సైనికుడు గుర్‌ప్రీత్ సింగ్ అలియాస్ గురి ఇచ్చిన స‌మాచారం మేర‌కు దేవింద‌ర్ సింగ్‌ అరెస్టు జరిగింది.

Pakistan Spy | రహస్య సమాచారం ISIకి చేర‌వేత‌..

దేవిందర్, గుర్‌ప్రీత్ 2017లో పూణేలో సైనిక శిక్షణ సమయంలో మొదటిసారి కలుసుకున్నారని గుర్తించారు. సిక్కింతో పాటు జమ్మూ కశ్మీర్(Jammu and Kashmir) లో విధులు నిర్వ‌ర్తించారు. ఇద్ద‌రు క‌లిసి ISIకి గూఢ‌చ‌ర్యం చేయ‌డం ప్రారంభించారు. ఈ క్ర‌మంలోనే గుర్‌ప్రీత్ ను పోలీసులు అరెస్టు చేశారు. మ‌రోవైపు, సంగ్రూర్ జిల్లాలోని నిహల్‌గఢ్ నివాసి దేవిందర్ సింగ్(Davinder Singh) భారత రహస్య సైనిక పత్రాలను సేకరించాడు. గుర్‌ప్రీత్ ఫిరోజ్‌పూర్ జైలులో ఉన్నప్పుడు, సున్నితమైన రక్షణ సమాచారం ఉందని భావిస్తున్న ఈ పత్రాలను దేవింద‌ర్ పాకిస్తాన్ ISIకి అప్పగించినట్లు AIG రవ్‌జోత్ కౌర్ గ్రేవాల్ తెలిపారు. అతడ్ని అరెస్టు చేసిన అనంత‌రం కోర్టు అనుమ‌తితో క‌స్ట‌డీలోకి తీసుకుని విచారిస్తున్నారు.

సరిహద్దు గూఢచర్య ముఠాను నిర్మూలించడంలో ఈ అరెస్టును మరో ప్రధాన విజయమ‌ని, జాతీయ భద్రతను కాపాడడంలో తమ నిబద్ధతకు ఇది నిద‌ర్శ‌న‌మ‌ని పంజాబ్ పోలీసులు (Punjab Police) తెలిపారు. “పంజాబ్ పోలీసులు దేశ వ్యతిరేక కార్య‌క‌లాపాల నుంచి దేశాన్ని రక్షించే లక్ష్యంతో దృఢంగా ఉన్నారు. దోషులుగా తేలిన వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకుంటారు” అని ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు