అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Election Commission | ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని (Special Voter List Revision) (సర్) దేశవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు (Bihar Assembly elections) ముందు చేపట్టిన ‘సర్’ విజయవంతమైన తరుణంలో మంగళవారం నుంచి రెండో దశ ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.
సోమవారం ఢిల్లీలో (Delhi) నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ ఈ విషయాన్ని తెలిపారు. ఎన్నికల జాబితాలపై ప్రతి ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు లేవనెత్తుతున్నందున ప్రత్యేక జాబితా సవరణ ప్రక్రియ చేపట్టడం అవసరమైందని చెప్పారు. 1951 నుంచి 2004 వరకూ ఎనిమిది సార్లు ‘సర్’ నిర్వహించామని చెప్పిన ఆయన.. చివరిసారిగా 21 ఏళ్ల క్రితం 2002-2004 మధ్య చేపట్టామని వివరించారు. ఇటీవల బీహార్‌లో తొలి విడత ఓటర్ జాబితా ప్రత్యేక సవరణను పూర్తి చేసినట్టు చెప్పారు. మంగళవారం నుంచి రెండో దశ చేపడతామన్నారు.
Election Commission | 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో..
రెండో విడత ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని తొమ్మిది రాష్ట్రాలతో పాటు మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో (యూటీ) నిర్వహించనున్నట్లు సీఈసీ తెలిపారు. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, అండమాన్ -నికోబార్, లక్షద్వీప్‌లలో ‘సర్’ నిర్వహించనున్నట్లు చెప్పారు. సోమవారం అర్ధరాత్రి నుంచి ఓటర్ల జాబితాను స్తంభింపజేస్తామని, తరువాత అన్ని వివరాలతో కూడిన ప్రత్యేక గణన ఫారాలను అందజేస్తామని జ్ఞానేష్ కుమార్ (Gyanesh Kumar) తెలిపారు. “పోల్ జాబితాలో అర్హులు మాత్రమే ఉండేలా, అనర్హులైన ఓటర్లు ఎవరూ లేరని ‘సర్’ నిర్ధారిస్తుంది” అని చెప్పారు.
Election Commission | బీహార్‌లో ఒక్క ఫిర్యాదు కూడా లేదు..
దాదాపు 7.42 కోట్ల మంది ఓటర్లతో తుది జాబితా ప్రచురించబడడంతో బీహార్‌లో ఓటర్ల జాబితాను శుభ్రపరిచే ప్రక్రియ సెప్టెంబర్ 30న ముగిసిందన్నారు. ఈ రోజు బీహార్ ఓటర్లకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విజయవంతమైన SIRలో పాల్గొన్న 7.5 కోట్ల మంది ఓటర్లకు నమస్కరిస్తున్నాం. కమిషన్ మొత్తం 36 రాష్ట్రాల నుంచి ఎన్నికల అధికారులను కూడా కలుసుకుంది. ఈ ప్రక్రియ గురించి వివరంగా చర్చించిందని” జ్ఞానేశ్ కుమార్ వివరించారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులను కలిసి SIR ప్రక్రియ గురించి వారికి వివరించాలని అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు (State Chief Election Officers), జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించినట్లు జ్ఞానేష్ కుమార్ చెప్పారు. రాజకీయ పార్టీలు ఓటర్ల జాబితా నాణ్యత సమస్యను అనేక సందర్భాల్లో లేవనెత్తాయన్న సీఈసీ.. బీహార్‌లో SIR మొదటి దశ సున్నా అప్పీళ్లతో పూర్తయిందని, జ్ఞానేష్ కుమార్ గుర్తు చేశారు.
Election Commission | మూడుసార్లు పరిశీలన..
SIR దశ-II కోసం పోలింగ్ అధికారులకు (polling officers) శిక్షణ మంగళవారం ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. BLOలు ప్రతి ఇంటినీ మూడుసార్లు సందర్శిస్తారన్నారు. “వలస వచ్చిన ఓటర్ల సమస్యను పరిష్కరించడానికి, ప్రజలు ఇప్పుడు తమ గణన ఫారాలను ఆన్లైన్లో సమర్పించవచ్చని” సీఈసీ వివరించారు. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్లు తమ అర్హత తెలిపే గుర్తింపు కార్డులు చూపించాలన్నారు.

