అక్షరటుడే, లింగంపేట/ఎల్లారెడ్డి: Panchayat elections | రెండోవిడత ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) పేర్కొన్నారు. ఈ మేరకు లింగంపేట, ఎల్లారెడ్డి, నిజాంసాగర్లలో కలెక్టర్ పర్యటించారు.
ఈ సందర్భంగా ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి పలు సూచనలు చేశారు. గ్రామాల్లో పకడ్బందీగా ఎన్నికల నిర్వహించాలని, ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు ఏర్పడితే జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని సూచించారు. రెండో విడతలో లింగంపేట, గాంధారి, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, నిజాంసాగర్, పిట్లం, మహమ్మద్ నగర్ (Mohammad Nagar) మండలాల్లో 197 స్థానాల్లో ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి.
Panchayat elections | ఎల్లారెడ్డి మండలంలో..
ఎల్లారెడ్డి మండలంలోని 27 గ్రామ పంచాయతీల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈమేరకు శనివారం మండలంలోని మోడల్ డిగ్రీ కళాశాలలో పంపిణీకి సిద్ధంగా ఉంచిన ఎన్నికల సామగ్రిని అధికారులతో కలిసి ఎంపీడీవో తాహెరా బేగం, తహశీల్దార్ ప్రేమ్ తనిఖీ చేశారు. కొన్ని గంటల్లోనే ఎన్నికల సామగ్రిని ఆయా మండలాలకు తరలిస్తామని వారు పేర్కొన్నారు. మండలంలో 31 గ్రామ పంచాయతీలకు ఐదు గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఈ సందర్భంగా ఆదివారం 26 గ్రామ సర్పంచ్ స్థానాలకు, 214 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అందుకు 214 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Panchayat elections | సమస్యాత్మక పంచాయతీల్లో..
మండలంలో క్రిటికల్ గ్రామపంచాయతీలుగా (Gram Panchayats) మల్కాపూర్, కొక్కొండలను గుర్తించారు. అలాగే సెన్సిటివ్ గ్రామపంచాయతీగా మీసన్పల్లి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆ మూడు గ్రామ పంచాయతీలకు ముగ్గురు మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒకటి నుంచి ఇద్దరు పోలీసులను బందోబస్తుగా ఏర్పాటు చేశారు.
Panchayat elections | సాయంత్రంలోగా సామగ్రి తరలింపు..
ఎన్నికల నిర్వహణ సిబ్బంది అందరికీ రూట్ల వారీగా సామగ్రి అందజేసి సాయంత్రంలోగా తరలించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పోలింగ్ సిబ్బందికి సైతం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు సమకూర్చినట్లు వివరించారు.