అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Scrub Typhus | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో స్క్రబ్ టైఫస్ కేసులు వేగంగా పెరుగుతుండటం ప్రజల్లో ఆందోళనకు కారణమైంది. ముఖ్యంగా చిత్తూరు, కాకినాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో ఈ వ్యాధి ఎక్కువగా బయటపడుతోంది.
ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు ఉండే చల్లని వాతావరణంలో స్క్రబ్ టైఫస్ (Scrub Typhus) తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెద్దలు మాత్రమే కాదు, చిన్నారులు కూడా ఈ వ్యాధికి గురవుతుండటం పరిస్థితిని మరింత ఆందోళనకరం చేస్తోంది. స్క్రబ్ టైఫస్ అనేది ఒరియెంటియా సుట్సుగముషి అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే అంటువ్యాధి. ఇది చిన్న నల్లులు (చిగ్గర్స్) కుట్టడం ద్వారా వ్యాపిస్తుంది.
Scrub Typhus | అజాగ్రత్త వద్దు..
పొదలు, పొలాలు, చెత్త పేరిన తేమ ప్రాంతాల్లో ఈ నల్లులు ఎక్కువగా ఉంటాయి. ఈ నల్లి కుట్టిన తర్వాత 6 నుంచి 21 రోజుల్లో లక్షణాలు కనిపించడం ప్రారంభమవుతుంది. స్క్రబ్ టైఫస్ లక్షణాల్లో జ్వరం, దద్దుర్లు, దగ్గు, జలుబు, నీరసం, కండరాల నొప్పులు, జీర్ణ సమస్యలు ఉన్నాయి. కొందరిలో ప్లేట్లెట్స్ తగ్గడం, జ్వర తీవ్రత పెరగడం కూడా జరుగుతుంది. సమయానికి చికిత్స అందించకపోతే ఈ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, మెదడు వంటి కీలక అవయవాలను ప్రభావితం చేసి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ (Multi-Organ Failure)కు దారితీసే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శరీరంపై దద్దుర్లు, జ్వరం, నీరసం మొదలైన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు, స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం.
వ్యాధి తొలి దశలోనే గుర్తిస్తే డాక్సిసైక్లిన్, అజిత్రోమైసిన్ (Azithromycin) వంటి మందులతో చికిత్స ఫలితం చక్కగా కనిపిస్తుందని నిపుణులు తెలిపారు. ప్రస్తుతం స్క్రబ్ టైఫస్‌కు వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో, వ్యాధి నివారణకే ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. పొలాలు, పొదల ప్రాంతాల్లో పనిచేసే సమయంలో జాగ్రత్తలు పాటించడం, పూర్తిగా శరీరాన్ని కప్పే దుస్తులు ధరించడం, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచడం, తేమ ప్రాంతాలకు దూరంగా ఉండడం ద్వారా స్క్రబ్ టైఫస్ రిస్క్‌ను తగ్గించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీని లక్షణాలు. దగ్గు, జ్వరం, జలుబు, నీరసం . కండరాల నొప్పులు, జీర్ణసమస్యలు కూడా ఎదురవుతాయి. కొందరిలో ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో పాటు జ్వర తీవ్రత పెరిగే అవకాశం ఉంది.