అక్షరటుడే, కామారెడ్డి: Science Museum | కామారెడ్డిలో సైన్స్ మ్యూజియం ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఉన్న పాత ఇంజినీరింగ్ కళాశాలలో (Kamareddy Engineering College) మ్యూజియం ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు.
ఇందులో భాగంగా గురువారం ఇంజినీరింగ్ కళాశాలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కళాశాలలో ఆన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని, తాగునీరు, టాయిలెట్స్, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. పిచ్చిమొక్కలు పూర్తిగా తొలగించాలని, అవసరమైన చోట ఫ్లోరింగ్ చేయించాలని అధికారులకు సూచించారు.
Science Museum | మరమ్మతులు చేయించాలి..
తరగతి గదుల శుభ్రతతో పాటు, మరమ్మతులు చేయించి అన్ని మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. సైన్స్ మ్యూజియంను విజయవంతం చేయాలని సంబంధిత అధికారులు మున్సిపల్, పంచాయితీరాజ్ శాఖ అధికారులు, కళాశాల ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానo పెంపొందించడంతో పాటు శాస్త్రీయ వైఖరి అభివృద్ధి చెందుతుందన్నారు.
విద్యార్థులు, యువత ప్రజలకు విజ్ఞానశాస్త్రం పట్ల ఆసక్తి పెంపొందించడం, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడం, శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ధి చేయడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి రాజు (DEO Raju), జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరాం రెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్, పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, మున్సిపల్ అధికారులు, మండల రెవెన్యూ అధికారి తదితరులు పాల్గొన్నారు.

