అక్షరటుడే, వెబ్‌డెస్క్: Guntur district | గుంటూరు జిల్లాలో ఓ యువతిని మత్తుపదార్ధాలకి బానిసని చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా (social media) పరిచయంతో ప్రారంభమైన ఈ వ్యవహారం చివరకు ఓ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన 17 ఏళ్ల బాలిక స్థానిక కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. అదే కాలేజీలో చదువుతున్న ఓ సీనియర్ యువకుడితో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానంటూ ఆమెను నమ్మించి దగ్గరయ్యాడు. ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఆమెకు డ్రగ్స్ అలవాటు చేశాడు. తన గదికి రప్పించి మత్తుపదార్థాలు ఇచ్చి అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా, మత్తులో ఉన్న సమయంలో ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ వీడియోలు, ఫోటోలు తీసినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
Guntur district | అలా బయటపడింది..
ఈ ఘటన బయటపడటానికి కారణం బాలిక తల్లి చేసిన ఆత్మహత్యాయత్నమే. బాధిత బాలిక తల్లి హైదరాబాద్‌లోని (Hyderabad) ఓ ప్రముఖ టీవీ చానల్లో న్యూస్ రీడర్‌గా పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉండగా, పెద్ద కుమార్తె తండ్రితో కలిసి గుంటూరులో ఉంటూ చదువుతోంది. రెండు రోజుల క్రితం కుమార్తె ఫోన్ పరిశీలించిన తల్లికి, ఆ యువకుడితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు కనిపించాయి. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె ఈ విషయంపై కుమార్తెను ప్రశ్నించగా, బాలిక తల్లిదండ్రులపైనే దాడికి దిగింది. ఈ ఘటనతో తీవ్రంగా కుంగిపోయిన తల్లి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే ఆమెను గుంటూరు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కి (Guntur Government General Hospital) తరలించారు.
విషయం తెలుసుకున్న ఈగల్ విభాగ ఐజీ ఏకే రవికృష్ణ, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ జీజీహెచ్‌లో బాధితురాలిని పరామర్శించారు. ఈ కేసును అత్యంత సీరియస్‌గా తీసుకుంటామని ఐజీ ఏకే రవికృష్ణ తెలిపారు. సోషల్ మీడియా ద్వారా మైనర్ విద్యార్థినిని డ్రగ్స్ ఉచ్చులోకి లాగిన ఘటనను తీవ్ర నేరంగా పరిగణిస్తామని చెప్పారు. పూర్తిస్థాయి దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే డ్రగ్స్‌కు Drugs బానిసైన బాలికకు ఆడిక్షన్ సెంటర్ ద్వారా చికిత్స అందించి సాధారణ స్థితికి తీసుకురావాలని ఆదేశించారు.
ఇదిలా ఉండగా, ఎస్పీ ఆదేశాల మేరకు తూర్పు డీఎస్పీ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో లాలాపేట సీఐ శివప్రసాద్ ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో బాలికకు డ్రగ్స్ అలవాటు చేసిన యువకుడు ఓ రాజకీయ పార్టీకి చెందిన విద్యార్థి సంఘ నాయకుడిగా తేలినట్లు విశ్వసనీయ సమాచారం. బాలిక అతడిని ప్రేమిస్తున్న విషయం తెలిసిన తల్లిదండ్రులు వేరే యువకుడితో వివాహం చేయాలని నిర్ణయించడంతో కుటుంబంలో గొడవలు జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఫోన్లో ఉన్న వీడియోలు, ఫోటోలు చూసి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు.