అక్షరటుడే, ఇందూరు: Transport Department | విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రతి పాఠశాల యాజామ్యానం తమ స్కూల్ బస్సులకు కచ్చితంగా ఫిట్నెస్ చేయించాలని రాష్ట్ర రవాణా శాఖ సంయుక్త కమిషనర్ (Joint Commissioner of Transport) చంద్రశేఖర్ గౌడ్ సూచించారు. సోమవారం జిల్లా కార్యాలయానికి విచ్చేసిన నేపథ్యంలో ‘అక్షరటుడే’ ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు.
Transport Department | 180 బస్సులకు మాత్రమే ఫిట్నెస్..
స్కూల్ బస్సుల ( School Bus) విషయంలో యాజమాన్యాలు బాధ్యతగా వ్యవహరించాలి. ప్రధానంగా 15 ఏళ్లు దాటిన బస్సులను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించరాదు. బస్సు డ్రైవర్లకు ఎప్పటికప్పుడు ఆరోగ్య శిబిరం నిర్వహించి కంటి పరీక్షలు చేయాలి. 60 ఏళ్లు దాటిన వారు డ్రైవింగ్‌కు అనర్హులు. పది బస్సుల కంటే ఎక్కువగా ఉన్న పాఠశాలలు డ్రైవర్లను అదనంగా నియమించుకోవాలి. జిల్లాలో 780 స్కూల్ బస్సులకు గాను.. 180 మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు పూర్తయ్యాయి. మిగతా బస్సులను యాజమాన్యాలు ఫిట్నెస్ చేయించాలి.
Transport Department | పిల్లలను కాపాడితే రివార్డు…
పాఠశాల బస్సుకు ప్రమాదం జరిగి చిన్నారులు అపాయంలో ఉన్నప్పుడు కాపాడితే ప్రభుత్వం రివార్డును అందజేస్తుంది. ప్రధానంగా గోల్డెన్ అవర్స్‌లో (Golden Hours) విద్యార్థులను ఆస్పత్రులకు తరలిస్తే రవాణా శాఖ సిఫార్సుతో రూ.25 వేలు అందజేస్తుంది. గతంలో ఈ రివార్డు రూ.5 వేలు ఉండేది.
Transport Department | నేరుగా ఆఫీస్‌కు రండి..
ప్రజలకు లైసెన్స్ తదితర ఎలాంటి పనులున్నా నేరుగా ఆర్టీఏ ఆఫీస్‌కు (RTA Office) రావాలి. అనవసరంగా ఏజెంట్లను సంప్రదించవద్దు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఏజెంట్లకు కార్యాలయాల్లో అనుమతి నిరాకరించాం. ఏ వ్యక్తికైతే పని ఉంటుందో వాళ్లను మాత్రమే అనుమతిస్తున్నాం. అన్ని జిల్లాల అధికారులకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం.
Transport Department | అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి..
జిల్లాలోని రవాణా శాఖ అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి. అవినీతికి దూరంగా ఉండాలి. ఏదైనా ఫిర్యాదులు వస్తే సహించేది లేదు. లైసెన్సుల జారీ, వాహన రిజిస్ట్రేషన్‌లో పక్కాగా వ్యవహరించాలి. ప్రధానంగా చెక్‌పోస్ట్‌లలో పనిచేసే వారిపై నిఘా ఉంటుంది.
Transport Department | త్వరలోనే ప్రత్యేక డ్రైవ్..
స్కూల్ బస్సులతో పాటు ప్రైవేటు బస్సులు, క్యాబ్‌లు ఇతర వాహనాలపై త్వరలోనే ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం. ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించకుండా రోడ్లపై తిరిగే వాహనాలపై కఠినచర్యలు ఉంటాయి. జిల్లా అధికారులతో పాటు రాష్ట్రస్థాయి అధికారులు కూడా ఇందులో పాల్గొంటారు. స్కూల్ బస్సులను ప్రత్యేకంగా తనిఖీ చేస్తారు.