అక్షరటుడే, వెబ్‌డెస్క్ :BJP Telangana | క్రమశిక్షణకు మారుపేరుగా భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party)కి పేరుండేది. కాషాయ దళ విధానం ఇతర పార్టీలకు ఆదర్శంగా ఉండేది. అలాంటి బీజేపీలో కట్టు తప్పింది. రాష్ట్ర పార్టీలో క్రమశిక్షణ దారి తప్పినట్లు కనిపిస్తోంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు నడుస్తోంది.
గతేడాదిగా కాలంగా రాష్ట్ర బీజేపీ(BJP)లో కుంపట్లు రాజుకున్నాయి. ముఖ్య నేతల మధ్య సయోధ్య కరువైంది. క్రమశిక్షణ లేకుండా పోయింది. ఎవరైనా సరే అదుపులో ఉండాలని రెండ్రోజుల క్రితమే పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) హెచ్చరించినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) పార్టీ లైన్ దాటి మాట్లాడడం, అది కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. బీజేపీకి తీవ్ర నష్టం చేకూర్చేలా.. “మంచి ప్యాకేజీ దొరికితే మావాళ్లు కూడా బీఆర్ఎస్‌లో చేరిపోతారనడం” చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పార్టీలో అంతర్గత కుమ్ములాటలపై మరోమారు చర్చ జరుగుతోంది.
BJP Telangana | ఆధిపత్య పోరు..
క్రమశిక్షణకు మారు పేరుగా ఉండే బీజేపీ(BJP)లో ఆధిపత్య పోరు నడుస్తోంది. ముఖ్య నేతల మధ్య అభిప్రాయ భేదాలు తీవ్రమయ్యాయి. పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా ఎవరికి తోచింది వారు, ఎవరికి నచ్చింది వారు బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఇది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపిస్తోంది.
అయినప్పటికీ నాయకులు మాత్రం తమ వైఖరిని మార్చుకోవడం లేదు. మరోవైపు, పార్టీ నాయకత్వం కూడా అంతర్గత పోరుపై దృష్టి పెట్టడం లేదు. ఫలితంగా రోజురోజుకు విభేదాలు తీవ్రమవుతున్నాయి. రాష్ట్ర పార్టీలో కీలక నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయన్నది కింది స్థాయి కార్యకర్తల వరకు తెలుసు. కానీ జాతీయ నాయకత్వం మాత్రం దీన్ని సరి చేసేందుకు ప్రయత్నాలు చేయడం లేదు. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలకు దిగక పోవడం వల్ల రోజురోజుకు అంతర్గత పోరు తీవ్రమవుతోంది.
BJP Telangana | పార్టీ వైఖరికి భిన్నంగా..
బీజేపీలో పార్టీ(BJP Party) వైఖరికి భిన్నంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకే అంశంపై పార్టీ నాయకులు తలో రకంగా మాట్లాడుతుండడం బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. అందుకు తాజాగా కవిత (MLC Kavitha) అంశమే బలమైన ఉదాహరణ. కవిత విషయంలో బీజేపీ నేతలు రకరకాలుగా స్పందించిన తీరు గందరగోళానికి దారి తీసింది. గతంలో ఎన్వీఎస్ ప్రభాకర్(NVS Prabhakar) కూడా జూన్ 2న బీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కాబోతోందంటూ సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాకుండా దుబ్బాక ఎంపీ రఘునందన్ కూడా జూన్ 2న ఎమ్మెల్సీ కవిత కొత్తపార్టీ పెట్టబోతుందంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ(Telangana BJP) నేతల కామెంట్స్ సొంత పార్టీకి నష్టం చేకూర్చేలా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమైంది.
దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సొంత పార్టీ నేతలకు క్లాస్ పీకారు. పార్టీ వైఖరికి భిన్నంగా మాట్లాడొద్దని ఆదేశాలు జారీ చేశారు. నేతల మధ్య ఏదైనా అభిప్రాయాలు ఉంటే మీడియాకు చెప్పే ముందు రాష్ట్ర నాయకత్వంతో పాటు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ఇవి చేయడకుండా ఎవరికి తోచిన విధంగా వారు మీడియా ముందుకు వెళ్లి మాట్లాడితే పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందంటూ.. పలువురు నేతలకు రెండు రోజుల క్రితం కిషన్‌రెడ్డి క్లాస్ పీకారు. కానీ తర్వాతి రోజే రాజాసింగ్ పార్టీ లైన్ దాటి సంచలన వ్యాఖ్యలు చేయడం బీజేపీలో క్రమశిక్షణ తప్పిందన్న ఆరోపణలకు బలం చేకూర్చినట్లయింది.
BJP Telangana | తీవ్రమైన విభేదాలు..
రాష్ట్ర బీజేపీలో ముఖ్య నేతల మధ్య సయోధ్య లేకుండా పోయింది. పార్టీ అధ్యక్షుడి మాటకూ విలువ లేకుండా పోయింది. వాస్తవంగా చెప్పాలంటే బండి సంజయ్(Bandi Sanjay) బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ ఓ స్థాయిలో బలపడింది. రాష్ట్రంలో కచ్చితంగా అధికారంలోకి వస్తుందన్న భావన బలపడుతున్న తరుణంలో.. బండి సంజయ్ ఎదుగుదలను పార్టీలోని కొందరు ఓర్వలేక పోయారు. మరోవైపు బండి ఒంటెద్దు పోకడలు, కొన్ని అంశాల్లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవడంతో అసమ్మతివాదులకు అవకాశం దొరికినట్లయింది. దీనిపై వరుసగా జాతీయ నాయకత్వానికి ఫిర్యాదులు అందడంతో అనూహ్యంగా బండిని అధ్యక్ష పదవి నుంచి తప్పించి, కిషన్‌రెడ్డికి బాధ్యతలు అప్పజెప్పింది.
అయితే, ప్రస్తుత అధ్యక్షుడిపై రాష్ట్ర పార్టీ వర్గాల్లోని కొందరికి సదాభిప్రాయం లేదు. పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టరని, అదే సమయంలో కొందరు రాజకీయ ప్రత్యర్థులతో కీలక సంబంధాలు పెట్టుకుని పార్టీని ఎదుగకుండా చేస్తున్నారని సొంత పార్టీ నేతలే ఆయనపై ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు, ముఖ్య నేతలు ఒకరంటే ఒకరికి గిట్టదు. ఎంపీ రఘునందన్‌రావు వైఖరి కూడా ఇలాగే ఉంటుందని, ఆయన సొంత వ్యవహార శైలి కొన్నిసార్లు రాష్ట్ర పార్టీకి వ్యతిరేకంగా ఉంటుందని గుర్తు చేస్తున్నాయి. ఇక మొన్న మొన్ననే పార్టీలో చేరిన ఈటల రాజేందర్ తనకంటూ.. ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
BJP Telangana | రాజాసింగ్‌ది మరోదారి..
బీజేపీలో సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Rajasingh)ది మరోదారి. ఆయన ఎప్పుడేం మాట్లాడతారో తెలియక పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. ఆయన చేసే వ్యాఖ్యలు తరచూ వివాదాస్పదమవుతున్నాయి. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదం కావడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. బండి సంజయ్ చొరవ తీసుకుని ఆయనపై నిషేధాన్ని ఎత్తివేయించారు. అయినప్పటికీ తీరు మార్చుకోని రాజాసింగ్ తరచూ ఏదో ఒక అంశాన్ని లేవనెత్తుతూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు.
గురువారం సొంత పార్టీ నేతలను ఉద్దేశించిన ఆయన హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీలో బీఆర్‌ఎస్ పార్టీ విలీనమంటూ కవిత చెప్పిన మాటలు నిజమేనేమో అని అన్నారు. పెద్ద ప్యాకేజీ దొరికితే తమ వాళ్లు ఎప్పుడో బీఆర్‌ఎస్(BRS)తో కలిసిపోయేవారన్నారు. ప్రతీ ఎన్నికల్లో బీజేపీ నేతలు కుమ్మక్కయ్యారని అందువల్ల పార్టీ చాలా నష్టపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇదే అంశంపై తాజాగా శుక్రవారం స్పందించిన రాజాసింగ్.. ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్‌లో తన అభిప్రాయం చెప్పినందుకు కరీంనగర్ నుంచి తన మీద యుద్ధం స్టార్ట్ అయిందని పరోక్షంగా బండి సంజయ్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో అసలు పార్టీలో ఏం జరుగుతుందో తెలియక బీజేపీ శ్రేణులు గందరగోళానికి గురవుతున్నాయి. మరోవైపు తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్ష పదవిని మార్చాలనే డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది.