అక్షరటుడే, వెబ్‌డెస్క్: SBI vs TCS Market Cap | మార్కెట్ విలువ పరంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) పైపైకి దూసుకువెళ్తుండగా.. దేశీయ టెక్ దిగ్గజ సంస్థ టీసీఎస్ పాతాళం వైపు దిగజారుతోంది. దేశంలో అత్యంత విలువైన కంపెనీలలో ఎస్బీఐ నాలుగో స్థానానికి ఎగబాకగా.. టీసీఎస్ ఆరో స్థానానికి పడిపోయింది.
SBI vs TCS Market Cap | ఎస్బీఐ ఇలా..
ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బీఐ (SBI) జోరుమీదుంది. బలమైన ట్రెజరీ, విదేశీ మారకపు ఆదాయం, నియంత్రిత ఉద్యోగుల ఖర్చుల మద్దతుతో అద్భుతమైన ఆర్థిక ప్రగతితో దూసుకుపోతోంది. ఏడాది కాలంగా మంచి ఫలితాలను సాధిస్తూ సాగుతున్న ఈ బ్యాంక్.. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో బలమైన పనితీరును కనబరిచింది. పన్ను అనంతర లాభం ఇయర్ ఆన్ ఇయర్ 24 శాతం, త్రైమాసికానికి 4 శాతం పెరిగింది. ఇది విశ్లేషకుల అంచనాలను మించింది. నికర వడ్డీ ఆదాయం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 9 శాతం, త్రైమాసికంలో 5 శాతం పెరిగింది.
ప్రీ ప్రొవిజన్ ఆపరేటింగ్ లాభం సైతం గత సంవత్సరంతో పోలిస్తే 40 శాతం, త్రైమాసికంతో 20 శాతం పెరిగాయి. ఆస్తి నాణ్యత కూడా మెరుగుపడింది. ఈ క్రమంలో ఇన్వెస్టర్ల సంపద సైతం పెరుగుతూ వస్తోంది. స్టాక్ ధర గత ఆర్థిక సంవత్సరంలో అరవై శాతానికిపైగా పెరగడం గమనార్హం. ఆ సంవత్సరంలో ఇప్పటివరకు 20 శాతానికిపైగా లాభాలను అందించింది. ఎస్బీఐ మార్కెట్ క్యాప్ వారంలోనే రూ. 1.20 లక్షల కోట్ల మేర పెరిగింది. ఈ క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market)లో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 10 లక్షల కోట్లు దాటిన మూడో లిస్టెడ్ బ్యాంక్‌గా అవతరించింది. మొత్తంగా ఆరో కంపెనీగా రికార్డుల్లోకెక్కింది. ప్రస్తుతం రూ. 11 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో నాలుగో స్థానంలో ఉంది. ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో ఎస్బీఐ షేరు ధర రూ. 1,1194 వద్ద ఉంది.
టీసీఎస్ అలా..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) కారణంగా సేవలపై ఆధారపడిన టెక్ కంపెనీలు ఒత్తిడికి గురవుతున్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్ తదతర కంపెనీల స్టాక్స్ విలువ గణనీయంగా పడిపోయింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ వారంలోనే పది శాతం క్షీణించింది. దేశీయ టెక్ దిగ్గజ కంపెనీ అయిన టీసీఎస్ షేరు ధర కూడా భారీగా తగ్గిపోయింది. టాటా గ్రూప్ (Tata Group)నకు చెందిన ఈ కంపెనీ స్టాక్ ధర ఎనిమిది శాతం మేర తగ్గింది. ఈ క్రమంలో మార్కెట్ క్యాప్ రూ. 9.95 లక్షల కోట్లకు తగ్గింది. వారం క్రితం వరకు దేశీయ స్టాక్ మార్కెట్లో లిస్టయిన అత్యంత విలువైన కంపెనీలలో నాలుగో స్థానంలో ఉన్న ఈ కంపెనీ ఇప్పుడు ఆరో స్థానానికి దిగజారింది. ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో ఎస్బీఐ షేరు ధర రూ. 2,698 వద్ద ఉంది.