అక్షరటుడే, వెబ్డెస్క్: SBI mCASH | దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ (SBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో, యోనోలైట్ (YONO Lite) ద్వారా ఎంక్యాష్ సేవలను నిలిపి వేయనున్నట్లు ప్రకటించింది. నవంబర్ 30 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని ప్రకటించింది.
భవిష్యత్తులో అన్ని బదిలీల కోసం యూపీఐ (UPI), ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్టీజీఎస్ సేవలను వినియోగించుకోవాలని ఎస్బీఐ ఖాతాదారులకు సూచించింది. ఇవి విస్తృతంగా వినియోగంలో ఉన్నాయని, సురక్షితమైనవని తెలిపింది. వినియోగదారులు mCASHను ఉపయోగించాల్సిన అవసరం లేకుండా నిధులను పంపడానికి వీలు కల్పిస్తాయని చెప్పింది. mCASH నిలిపివేత అనంతరం భవిష్యత్తులో జరిగే అన్ని డబ్బు బదిలీలు ఈ పద్ధతుల ద్వారా జరగాలని బ్యాంక్ వెబ్‌సైట్ పేర్కొంది.
SBI mCASH | ఎంక్యాష్ అంటే ఏమిటి
ఎస్బీఐ కస్టమర్లు లబ్ధిదారుడిని ముందుగా రిజిస్ట్రర్ చేసుకోకుండా.. డబ్బులు పంపడానికి ఎంక్యాష్ సేవలను గతంలో ఎస్బీఐ ప్రవేశ పెట్టింది. దీనిద్వారా వినియోగదారులు గ్రహీత మొబైల్ నంబర్, ఈ–మెయిల్ ఐడీని ఉపయోగించి Online SBI లేదా State Bank Anywhere ద్వారా నిధులను బదిలీ చేయవచ్చు. గ్రహీత mCASH మొబైల్ యాప్, ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా పంపబడిన సురక్షిత లింక్ ద్వారా నిధులను క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఇతర సురక్షిత సాధనాలు అందుబాటులోకి రావడంతో ఎంక్యాష్ అవసరం లేదని ఎస్బీఐ భావించింది. ఈ మేరకు సేవలను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది.
