అక్షరటుడే, హైదరాబాద్ : Saudi Accident | సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ కేబినెట్ సంతాపం తెలిపింది. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
మంత్రి అజారుద్దీన్ (Minister Azharuddin), ఎంఐఎం ఎమ్మెల్యే, మైనార్టీ విభాగానికి చెందిన ఓ అధికారితో ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని సౌదీకి పంపించాలని సూచించింది. చనిపోయిన వారి మృతదేహాలకు అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. బాధిత కుటుంబ సభ్యులను ఒక్కో కుటుంబానికి ఇద్దరు చొప్పున తీసుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది.
Saudi Accident | 45 మంది మృతులు హైదరాబాదీలే
సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కాగా.. వీళ్లంతా హైదరాబాద్కు చెందిన వారేనని తెలంగాణ హజ్ కమిటీ (Telangana Haj Committee) ఓ ప్రకటనలో తెలిపింది. మృతుల్లో 17 మంది పురుషులు, 18 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నట్లు చెప్పింది. నాలుగు ట్రావెల్ ఏజెన్సీల ద్వారా ఈనెల 9న హైదరాబాద్ (Hyderabad) నుంచి వీరు ఉమ్రాకు వెళ్లారు. మక్కా యాత్ర పూర్తిచేసుకుని మదీనాకు వెళ్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది.
Saudi Accident | ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి
సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌లోని విద్యానగర్ (Vidyanagar)కు చెందిన ఒకే కుటుంబంలోని 18 మంది మృతి చెందారు. విశ్రాంత రైల్వే ఉద్యోగి నజీరుద్దీన్ తన కుటుంబ సభ్యులతో కలిసి మక్కాకు వెళ్లారు. ఈ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది.
