అక్షరటుడే, వెబ్‌డెస్క్: Saudi Arabia | సాధారణంగా తీవ్రమైన, క్షమించరాని నేరాలకు మాత్రమే మరణశిక్ష విధించడం ప్రపంచవ్యాప్తంగా ఆచారంగా ఉంది. అయితే సౌదీ అరేబియాలో పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ ఉరిశిక్షలు చాలా సాధారణంగా అమలవుతున్నాయి.
తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం 2025 ఒక్క ఏడాదిలోనే సౌదీ ప్రభుత్వం (Saudi Government) ఏకంగా 356 మందికి మరణదండన అమలు చేసింది. ఈ సంఖ్య ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. సౌదీ అరేబియాలో మరణశిక్షలు రికార్డు స్థాయికి చేరడానికి ప్రధాన కారణం మాదకద్రవ్యాలపై ప్రభుత్వం ప్రకటించిన కఠిన యుద్ధమేనని తెలుస్తోంది. మొత్తం మరణదండనల్లో 243 కేసులు డ్రగ్స్ రవాణా, స్మగ్లింగ్‌కు సంబంధించినవే కావడం గమనార్హం.
Saudi Arabia | రికార్డ్ ఉరి శిక్షలు..
డ్రగ్స్ అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలనే ఉద్దేశంతో సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుండటంతో ఉరిశిక్షల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే ఈ స్థాయిలో మరణశిక్షలు అమలు చేయడంపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మానవ హక్కుల సంఘాలు (Human Rights Organizations) సౌదీ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇక గతేడాది కూడా సౌదీ అరేబియాలో ఉరిశిక్షలు భారీ సంఖ్యలోనే అమలయ్యాయి. 2024లో మొత్తం 338 మందికి మరణదండన విధించారు. సుమారు మూడేళ్లపాటు మాదకద్రవ్యాల కేసుల్లో ఉరిశిక్షల అమలును నిలిపివేసిన సౌదీ ప్రభుత్వం, 2022 చివర్లో మళ్లీ డ్రగ్స్ నేరాలకు మరణశిక్షలను పునఃప్రారంభించింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఉరిశిక్షల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
మాదకద్రవ్యాలపై యుద్ధం ప్రారంభించిన తర్వాత సౌదీ అరేబియా హైవేలు, సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీ కేంద్రాలను భారీగా పెంచింది. లక్షలాది మాదకద్రవ్యాల మాత్రలను స్వాధీనం చేసుకున్న అధికారులు, డజన్ల కొద్దీ స్మగ్లర్లను (Smugglers) అరెస్ట్ చేశారు. అయితే ఈ కఠిన చర్యలతో పాటు మరణశిక్షల అమలు కొనసాగుతుండటంతో గల్ఫ్ రాజ్యం అంతర్జాతీయ స్థాయిలో నిరంతర విమర్శలను ఎదుర్కొంటోంది. ఇదిలా ఉండగా, సౌదీ అరేబియా తన చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థను డైవర్సిఫై చేసేందుకు ప్రయత్నిస్తోంది. పర్యాటక రంగ అభివృద్ధి, అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లు, 2034 ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ నిర్వహణ వంటి భారీ ప్రాజెక్టులపై కోట్లాది డాలర్లు ఖర్చు చేస్తోంది. అయితే దేశంలో శాంతిభద్రతలు, చట్టసువ్యవస్థను కాపాడటానికి మరణశిక్ష అవసరమని అక్కడి పాలకులు వాదిస్తున్నారు.