అక్షరటుడే, వెబ్డెస్క్ : Saudi Arabia | సౌదీ అరేబియాకు పాకిస్తానీ యాచకులు పెద్ద తలనొప్పిగా మారారు. వీసా ఆంక్షలు, నో-ఫ్లై జాబితాలు, బహిష్కరణలు అమలు చేస్తున్నప్పటికీ పాకిస్తాన్ (Pakistan)కు చెందిన యాచకుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదని సౌదీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా మక్కా, మదీనా వంటి ఇస్లాం పవిత్ర స్థలాల్లో పాకిస్తానీ యాచకులు భిక్షాటన చేస్తూ కనిపించడం సౌదీకి పరువు సమస్యగా మారింది. హజ్, ఉమ్రా, పర్యాటక వీసాలను దుర్వినియోగం చేస్తూ చాలామంది పాకిస్తానీయులు సౌదీకి వచ్చి వీధుల్లో భిక్షాటనకు దిగుతున్నారని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల సౌదీ అరేబియా దాదాపు 56 వేల మంది పాకిస్తానీయులను దేశం నుంచి బహిష్కరించింది.
Saudi Arabia | తలనొప్పిగా యాచకులు..
అయినప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదని తెలుస్తోంది. ఇదే తరహాలో యూఏఈ కూడా గత నెలలో నేర కార్యకలాపాలు, భిక్షాటన ఆరోపణలతో అనేక మంది పాకిస్తానీయులకు వీసాలు నిలిపివేసింది. గత కొన్ని సంవత్సరాలుగా పశ్చిమ ఆసియా దేశాల్లో పాకిస్తానీ యాచకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వీధుల్లో భిక్షాటన కోసం తీర్థయాత్ర, పర్యాటక వీసాలను ఉపయోగించుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామాలు ఆతిథ్య దేశాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీంతో కఠినమైన వీసా పరిశీలనలు, తిరస్కరణలు అమలు చేస్తున్నారు. దీని ప్రభావం నిజమైన పాకిస్తానీ యాత్రికులు (Pakistani Pilgrims), కార్మికులు, విద్యార్థులపై పడుతోందని విమర్శలు వస్తున్నాయి.
ఈ పరిస్థితిని నియంత్రించకపోతే పాకిస్తానీ హజ్, ఉమ్రా యాత్రికులపై ప్రతికూల ప్రభావం తప్పదని సౌదీ అరేబియా మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2024లోనే హెచ్చరించింది. సౌదీ వీధులు పాకిస్తానీ యాచకులతో నిండిపోయాయన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.ఈ అంశంపై పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (Federal Investigation Agency) చీఫ్ రిఫత్ ముఖ్తార్ స్పందిస్తూ, అక్రమ వలసలు మరియు భిక్షాటన ముఠాలు ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపులోకి రాకుంటే హజ్, ఉమ్రా వెళ్లే పాకిస్తానీలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన హెచ్చరించారు. 2024లో పశ్చిమ ఆసియా దేశాల్లో అరెస్టయిన యాచకుల్లో 90 శాతం మంది పాకిస్తాన్కు చెందిన వారేనని పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖ కూడా వెల్లడించింది.
ఈ వ్యవస్థీకృత భిక్షాటన ముఠాలను అడ్డుకునేందుకు FIA 2025లో 66,154 మంది ప్రయాణికులతో కూడిన నో-ఫ్లై జాబితాను సిద్ధం చేసింది. అయినప్పటికీ కొందరు పని వీసాలతో విదేశాలకు వెళ్లి అక్కడ భిక్షాటనకు పాల్పడుతున్నారని అధికారులు చెబుతున్నారు. మక్కా, మదీనా వంటి పవిత్ర స్థలాల్లో యాత్రికుల అపరాధ భావనను ఉపయోగించుకుని డబ్బు వసూలు చేయడం వీరి పద్ధతిగా మారిందని విమర్శలు ఉన్నాయి.