అక్షరటుడే, వెబ్డెస్క్ : Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం మరోసారి దృష్టి సారించింది. జిల్లాల సంఖ్య, పేర్లు, సరిహద్దులు, మండలాల సమీకరణ వంటి అంశాలపై మంత్రి వర్గ ఉపసంఘం కీలక చర్చలు ప్రారంభించింది. ఇప్పటికే కొన్ని జిల్లాల (Districts) పేర్లపై పలు అభ్యంతరాలు వచ్చాయి. దీంతో ప్రజల అభిప్రాయాలను సేకరించే ప్రక్రియలో భాగంగా జిల్లా పర్యటనలు చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశం(Cabinet Meeting)లో జిల్లాల పునర్విభజనలో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు ఉపసంఘాన్ని నియమించింది.
Andhra Pradesh | జిల్లాల విభజన..
ఈ కమిటీ తొలి సమావేశం జరగగా, ఏడు మంది మంత్రులు పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధుల సూచనలు, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ నివేదికను నెల రోజులలోపు సిద్ధం చేయాలని సీఎం(CM Chandra Babu) సూచించారు. మొత్తం ఆరు కొత్త జిల్లాలు ఏర్పాటుకు కసరత్తు సాగుతోంది. వీటిలో పలాస,అమరావతి, మార్కాపురం,గూడూరు,మదనపల్లె,రాజంపేట.. ఈ జిల్లాల ఏర్పాటుతో పాటు కొన్ని స్థానాల్లో పేర్ల మార్పులు, సరిహద్దుల మార్పులు జరుగనున్నాయి. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) పాలనలో తీసుకున్న కొన్ని జిల్లాల నిర్ణయాలపై విమర్శలు రావడంతో, తాజాగా ప్రభుత్వం వాటిని సవరిస్తోంది. సెప్టెంబర్ 2 వరకు ప్రజలు తమ అభిప్రాయాలు, అభ్యంతరాలు, సూచనలు ప్రభుత్వం వద్దకు పంపించవచ్చు. 29, 30 తేదీల్లో మంత్రివర్గ ఉపసంఘం వివిధ జిల్లాల్లో పర్యటించనుంది. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరిస్తారు.
ఈ కసరత్తులో గ్రామాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల సరిహద్దులు, పేర్లు, పరిపాలన సౌలభ్యం, ప్రయోజనాలు వంటి అంశాలపై సమగ్రంగా పరిశీలన జరగనుంది. జిల్లాల పునర్విభజన, సరిహద్దుల మార్పు నేపథ్యంలో మంత్రి సత్యప్రసాద్ (Minister Satya Prasad) ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు. ప్రజలు తమ ప్రాంతంలోని సమస్యలు, అభ్యర్థనలు ఏమైతే ఉన్నా, అవి ఆలస్యం చేయకుండా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి(District Collector Office) అందించాలన్నారు. అందిన వినతులను ప్రభుత్వం ప్రాధాన్యంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.జిల్లాల సరిహద్దుల మార్పు అంశంపై అన్ని కోణాల నుండి సమగ్ర పరిశీలన జరిపి, తగిన వివరాలతో ప్రత్యేక నివేదికను సీఎం చంద్రబాబుకు సమర్పిస్తామని మంత్రి చెప్పారు. అన్ని నిర్ణయాలు ప్రజలకు అవసరమైన పరిపాలనా సౌకర్యాలను అందించాలన్న దృష్టితోనే తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి జిల్లాల సరిహద్దుల మార్పు ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి వెల్లడించారు.
ప్రస్తుతం ప్రభుత్వం జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల సరిహద్దుల మార్పు ప్రక్రియకే పరిమితమై ఉందని, నియోజకవర్గాల(Constituencies) సరిహద్దులు మార్పు పరిధిలో లేవని స్పష్టం చేశారు. కొన్ని జిల్లాల్లో జిల్లా కేంద్రాలు ప్రజలకు చాలా దూరంగా ఉండటం వల్ల ప్రజలు 150 కిలోమీటర్ల దాకా ప్రయాణించాల్సి వస్తోందని గుర్తించారు. ఈ సమస్యను అధిగమించడానికే జిల్లాల పునర్విభజన అవసరమని వివరించారు