అక్షరటుడే, బాన్సువాడ: Banswada MLA | గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు, పాలకవర్గ సభ్యులదే ప్రధాన పాత్ర అని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) అన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తూ.. గ్రామాల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
బాన్సువాడ పట్టణ (Banswada town) శివారులోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో గెలుపొందిన పలువురు సర్పంచ్లను సన్మానించారు. 137 గ్రామ పంచాయతీలకు (Gram Panchayats) గాను పోచారం బలపరిచిన అభ్యర్థుల్లో 111 స్థానాల్లో గెలుపొందిన సర్పంచులు, ఉప సర్పంచులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఎంతో నమ్మకంతో మిమ్మల్ని సర్పంచులు, వార్డు సభ్యులుగా ఎన్నుకున్నారన్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, నాయకులు పోచారం సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.