అక్షరటుడే, వెబ్డెస్క్: KTR | దేశ చరిత్రలో పంచాయతీ ఎన్నికల్లో ఏ ముఖ్యమంత్రి ప్రచారం చేయలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) గెలుపొందిన బీఆర్ఎస్ అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పలు జిల్లాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. దీనిపై కేటీఆర్ విమర్శలు చేశారు.
పంచాయతీ ఎన్నికల్లో సీఎం ప్రచారం చేసినా.. బీఆర్ఎస్ సత్తా చాటిందన్నారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ గెలుపొందిందని పేర్కొన్నారు. అడ్డదారిలో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి రాష్ట్రంలో ఇక కాలం చెల్లిందని పల్లె ప్రజలు ఓటు ద్వారా తేల్చి చెప్పారన్నారు. ప్రభుత్వ పెద్దలు ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీ ఓడిపోయిందని చెప్పారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ ముఖచిత్రానికి పంచాయతీ ఎన్నికలు నిదర్శనం అని తెలిపారు.
KTR | హామీలు అమలు చేయకపోవడంతో..
కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని కేటీఆర్ అన్నారు. పరిపాలనా వైఫల్యాలకు తోడు, గ్యారెంటీల అమలులో చేసిన ఘోరమైన మోసాలే ఆ పార్టీని కూకటివేళ్లతో పెకిలిస్తున్నాయన్నారు. పార్టీ గుర్తుపై జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు ఇంతకన్నా ఘోర పరాభవం తప్పదన్నారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార పక్షం ఏకపక్షంగా విజయం సాధిస్తే, నేడు కాంగ్రెస్ సగం పంచాయతీలను కూడా గెలవలేకపోయిందని విమర్శించారు.
KTR | సర్పంచులు భయపడొద్దు
కాంగ్రెస్ అంటే అభయహస్తం కాదు, రిక్త హస్తం అని కేటీఆర్ అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) నాటికి అధికార పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కష్టకాలంలో బీఆర్ఎస్ వెన్నంటి నిలిచిన ప్రతిఒక్కరి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేలు బెదిరించినా సర్పంచ్లు భయపడొద్దని కేటీఆర్ సూచించారు. బీఆర్ఎస్ సర్పంచ్ల కోసం జిల్లాకో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామన్నారు.