అక్షరటుడే, గాంధారి: Gandhari | ఊరికి వెళ్లి వచ్చేసరికి సర్పంచ్ అభ్యర్థి ఇంటితో సహా ఆమె తల్లిదండ్రుల ఇల్లు సైతం మంటల్లో కాలిపోయింది. ఈ ఘటనలో రూ. 7 లక్షల నగదు పూర్తిగా బుగ్గిపాలైంది. ఈ సంఘటన గాంధారి మండలంలోని చద్మల్ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చద్మల్(chadmal) గ్రామానికి చెందిన మరాఠి రోజా సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో( Local Body Elections) నిలబడింది. అయితే బుధవారం గాంధారి మండల కేంద్రంలో నిర్వహించిన ఓ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లింది. అక్కడే తన కూతురు బర్త్డే సందర్భంగా షాపింగ్ కూడా చేసింది. అయితే తన ఇల్లు కాలిపోయిందనే ఫోన్లో స్థానికులు సమాచారం ఇవ్వగా ఆమె పరుగు పరుగున చద్మల్ గ్రామానికి చేరుకుంది.
అప్పటికే ఆమె ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఆ ఇంట్లో రూ.3 లక్షల నగదు అగ్నికి ఆహుతైంది. అలాగే తులంన్నర బంగారు కమ్మలు, 25తులాల వెండి, దుస్తులు కాలిపోయాయి. అలాగే పక్కనే ఉన్న రోజా తల్లిదండ్రుల ఇంట్లో ఉన్న రూ.4 లక్షలు నగదు, 40 తులాల వెండి కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ సమాచారం అందుకున్న ఆర్ఐ సంఘటనాస్థలానికి చేరుకుని పంచనామా చేశారు.