అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Panchayat elections | రాష్ట్రవ్యాప్తంగా రెండో దశ పంచాయతీ ఎన్నికలు (Panchayat elections) ఉత్సాహంగా సాగుతున్నాయి. అయితే పలు గ్రామాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఓ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి పోలింగ్ రోజే మృతి చెందాడు.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో (Nelakondapalli mandal) పోలింగ్ రోజే సర్పంచ్ అభ్యర్థి మృతి చెందాడు. అనాసాగరంలో ఇండిపెండెంట్ అభ్యర్థి దామల నాగరాజు పోటీ చేశారు. ప్రచారంలో భాగంగా తీవ్ర ఒత్తిడికి లోనైన ఆయన శనివారం అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. ఎన్నికల రోజే సర్పంచ్‌గా పోటీ చేస్తున్న నాగరాజు మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.
Panchayat elections | మంచిర్యాలలో ..
మంచిర్యాల జిల్లాలో (Mancherial district) పోలింగ్ రోజే సర్పంచ్ అభ్యర్థికి గుండెపోటు వచ్చింది. తాండూరు మేజర్ పంచాయతీ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి వెంకటస్వామి పోటీ చేస్తున్నారు. ఆదివారం ఉదయం పోలింగ్ జరుగుతుండగా.. ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
Panchayat elections | పలు గ్రామాల్లో ఉద్రిక్తత
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చేసుకుంది. పోలింగ్ బూత్ వద్ద బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేయడంపై కాంగ్రెస్ నాయకుల అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకోగా.. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాల వారిని అక్కడి నుంచి పంపించారు.
ఖమ్మం జిల్లా తిరుమలాపాలెం గ్రామంలో పోలీసులతో ఎన్నికల ఏజెంట్ల వాగ్వాదం చేశారు. ఏజెంట్లను లోనికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా ధర్మారం పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రిగ్గింగ్ జరుగుతోందని ప్రత్యర్థి వర్గం ఆందోళన చేపట్టింది. పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేయడంతో పోలీసులు లాఠీలతో చెదరగొట్టారు.