అక్షరటుడే, వెబ్డెస్క్: Panchayat elections | రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలు (panchayat elections) కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయింది. చలిగా ఉండటంతో ఓటర్లు 9 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు ఎక్కువగా రాలేదు. 9 తర్వాత పోలింగ్ ఊపందుకుంది.
రెండో విడతలో 193 మండలాల్లోని 3,911 సర్పంచ్ పదవులకు, 29,917 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభిస్తారు. చిన్న పంచాయతీల్లో సాయంత్రం లోపు, పెద్ద గ్రామాల్లో రాత్రి వరకు ఫలితాలు తేలనున్నాయి.
Panchayat elections | టవర్ ఎక్కి నిరసన
మెదక్ జిల్లా (Medak district) నార్సింగి మండలంలో రెండో విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. నర్సంపల్లి పెద్ద తండాకు (Narsampally Pedda Thanda) చెందిన శంకర్ నాయక్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన ఆదివారం ఉదయం సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. తన ప్రత్యర్థి ఓటుకు రూ.2 వేలు పంపిణీ చేశారని ఆరోపించారు. తనను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారని సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేపట్టారు. ఈ చర్యలపై తక్షణమే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులు, పోలీసులను కోరారు. సంఘటనతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
Panchayat elections | ఇరువర్గాల ఘర్షణ
నాగర్ కర్నూల్ జిల్లా (Nagarkurnool district) తిమ్మాజిపేట మండలం అవంచలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వనపర్తి జిల్లా చిమనగుంటపల్లి 8వ వార్డులో పోలింగ్ నిలిచిపోయింది. ఓ అభ్యర్థి గుర్తు బ్యాలెట్ పేపర్లో రాలేదు. దీంతో అధికారులు పోలింగ్ నిలిపివేశారు.