అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sara Tendulkar | మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ (Sara Tendulkar) ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఓ ప్రతిష్టాత్మక అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించేందుకు ఆస్ట్రేలియా టూరిజం డిపార్ట్‌మెంట్ (Australian Tourism Department) చేపట్టిన ప్రచార కార్యక్రమంలో సారా టెండూల్కర్ భాగం కానుంది. ఈ ప్రచారం ద్వారా ప్రపంచంలోని వివిధ దేశాల పర్యాటకులను ఆస్ట్రేలియాకు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత యువతలో మంచి గుర్తింపు ఉన్న సారా టెండూల్కర్‌ను అంబాసిడర్‌గా ఎంపిక చేయడం ఆసక్తికరంగా మారింది.
Sara Tendulkar | బ్రాండ్ అంబాసిడర్‌గా..
సారా ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ కలిగిన సెలెబ్రిటీ. ఆమె స్టైల్, గ్రేస్, ట్రావెల్ ప్యాషన్‌కు యువతలో మంచి ఆదరణ ఉంది. ఆస్ట్రేలియాలోని అందమైన పర్యాటక ప్రాంతాలు, వైవిధ్యమైన అనుభవాలను సారా ఈ ప్రచారంలో పరిచయం చేయనుంది. ఈ ప్రచారానికి సంబంధించిన ఫోటో షూట్లు, ప్రమోషనల్ వీడియోలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఇక ఈ కాంపెయిన్‌లో భాగంగా సారా ఆస్ట్రేలియాలోని (Australia) పలు ప్రముఖ ప్రాంతాల్లో పర్యటించి.. అక్కడి సాంస్కృతిక, ప్రకృతి సౌందర్యాలను ప్రపంచానికి పరిచయం చేయనుంది.
ఆస్ట్రేలియా ప్రభుత్వం 130 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తూ ప్రారంభించిన తాజా టూరిజం ప్రచార కార్యక్రమం “Come and Say G’day”కి సారాను భారత బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంపై ఇండియన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని ముందుగా ఆగస్టు 7న చైనాలో ప్రారంభించి, అనంతరం ఇంగ్లండ్, భారత్, అమెరికా, జపాన్ వంటి కీలక దేశాల్లో ఏడాది చివరి నాటికి ప్రారంభించనున్నారు.
ప్రధాన మస్కాట్ ‘రూబీ ద రూ’తో పాటు ఈసారి వివిధ దేశాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు ఈ ప్రచారంలో భాగమవుతారు. భారతదేశానికి ప్రతినిధిగా సారా టెండూల్కర్‌ను ఎంపిక చేసినట్లు ఆస్ట్రేలియన్ టూరిజం మేనేజింగ్ డైరెక్టర్ ఫిలిప్పా హారిసన్ వెల్లడించారు. ఆస్ట్రేలియన్ యాక్టర్ థామస్ వెదరాల్ (Australian actor Thomas Weatherall) కూడా ఈ కాంపెయిన్‌లో కనిపించనున్నాడు. ఈ గ్లోబల్ ప్రచారం తొలిసారిగా 2022 అక్టోబర్‌లో ప్రారంభమైంది. 2022 నుంచి ఇప్పటివరకు ఈ ప్రచారానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం $255 మిలియన్లకు పైగా పెట్టుబడి పెట్టింది. సారా టెండూల్కర్ ఈ ప్రచారంలో భాగం కావడం భారతీయ టూరిస్టులను ఆకర్షించడంలో కీలకంగా మారనుంది.