అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pushpa -2 | హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో గల సంధ్య థియేటర్ తొక్కిసలాట (Sandhya Theater stampede) ఘటనపై చిక్కడపల్లి పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో హీరో అల్లు అర్జున్ ఏ–11గా చేర్చారు.
అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పుష్ప –2 సినిమా గతేడాది రిలీజైన విషయం తెలిసిందే. అయితే 2024 డిసెంబర్ 4న బెనిఫిట్ షో వేశారు. ఈ షో కోసం అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు (Sandhya Theater) రాత్రి 9:30 గంటలకు వచ్చారు. దీంతో హీరోను చూడటానికి అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించగా.. రేవతి చనిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఏడాది తర్వాత ఛార్జీషీటు దాఖలు చేశారు.
Pushpa -2 | 23 మందిపై అభియోగాలు
ఈ కేసులో పోలీసులు మొత్తం 23 మందిపై అభియోగాలు మోపారు. సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగినట్లు పేర్కొన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు దర్యాప్తు పూర్తయిందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) శనివారం తెలిపారు. ఈ కేసులో మొత్తం 14 మందిని అరెస్ట్ చేశామన్నారు. ముందస్తు బెయిల్ పొందిన 9 మంది నిందితులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ సంఘటన సమయంలో థియేటర్ యాజమాన్యం, ఈవెంట్ నిర్వాహకులు, ప్రైవేట్ భద్రతా సిబ్బంది, సంబంధిత ఇతరుల మధ్య ప్రణాళిక, జన సమూహ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, సమన్వయంలో లోపాలు ఉన్నాయని దర్యాప్తులో తేలిందని తెలిపారు.
నిందితుల జాబితా: ఏ–1గా అగమతి రామ్ రెడ్డి అలియాస్ పెద్దా రామ్ రెడ్డి, ఏ –2 : అగమతి రామ్ రెడ్డి అలియాస్ చిన్నా రామ్ రెడ్డి, ఏ–3 సందీప్, ఏ–4 సుమిత్ అలియాస్ మిట్టు, ఏ–5 అగమని వినయ్ కుమార్, ఏ–6 అగమతి అశుతోష్ రెడ్డి, ఏ–7 రేణుకా దేవి, ఏ–8 ఆగమతి అరుణ రెడ్డిని చేర్చారు. వీరంతా సంధ్య థియేటర్లో భాగస్వాములు. అలాగే ఏ–9గా థియేటర్ మేనేజర్ నాగరాజు, ఏ10గా దిగువ బాల్కనీ ఇన్ఛార్జ్ మరియు గేట్ కీపర్ గంధకం విజయ్ చందర్‌ను చేర్చారు.
Pushpa -2 | అల్లు అర్జున్‌పై..
ఏ 11గా హీరో అల్లు అర్జున్ పేరును పోలీసులు ఛార్జీషీట్లో చేర్చారు. ఆయన మేనేజర్లు జోస్య భట్ల సంతోష్ కుమార్, శరత్ చంద్ర నాయుడు, బన్నీ ఫ్యాన్స్ అసోసియేషన్ ఇన్‌ఛార్జి తాటిపాముల వినయ్ కుమార్‌ను సైతం నిందితులుగా పేర్కొన్నారు. ఈవెంట్ ఆర్గనైజర్, అల్లు అర్జున్ సెక్యూరిటీ, బౌన్సర్ల పేర్లను కూడా ఛార్జీ షీట్లో చేర్చారు.