Collector Kamareddy
Collector Kamareddy | పొలాల్లో ఇసుక మేటలను త్వరగా తొలగించాలి: కలెక్టర్

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Collector Kamareddy | ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైతుల పొలాల్లో వేసిన ఇసుక మేటలను త్వరగా తొలగించాలని కలెక్టర్​ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) అన్నారు.

లింగంపేట (Lingampet) మండలం బురిగిద్ద గ్రామంలో ఇసుక మేట వేసిన రైతు సభావత్ లక్ష్మి పొలంలో ఈజీఎస్ ద్వారా చేపట్టిన ఇసుక మేటల తొలగింపు కార్యక్రమాన్ని గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతు మాట్లాడుతూ.. అధైర్యపడవద్దని మీ పొలంలో ఇసుక మేటలను పూర్తిగా తొలగిస్తామన్నారు. ఈజీఎస్ (EGS) ద్వారా ఉపాధి హామీకూలీలకు రూ. 1,21,000 కూలీ చెల్లించి పొలంలో ఉన్న 1200 క్యూబిక్ మీటర్ల ఇసుకను పూర్తిస్థాయిలో తొలగిస్తామని తెలిపారు.

అధిక వర్షాల కారణంగా ఇసుక మేటలు వేసిన పొలాల రైతులకు అధికంగా లబ్ధిచేకూరేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. లింగంపేట మండలంలోని 41 గ్రామాల్లో సుమారు 287 ఎకరాలలో ఇసుక మేట వేసిందని ఆయన పేర్కొన్నారు. మళ్లీ పంటలు వేసుకునేలా పొలాలను సిద్ధం చేయాలని, తొలగించిన ఇసుకను ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి, ఇతర ప్రభుత్వ నిర్మాణాలకు ఉపయోగించాలని ఎంపీడీవో నరేశ్​కు సూచించారు.

ఇసుక మేటల తొలగింపు కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని డీఆర్డీవో సురేందర్​కు సూచించారు. పంట నష్టం వివరాలను పూర్తిస్థాయిలో సేకరించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

ఇరిగేషన్ (Irrigation Department) అధికారి శ్రీనివాస్​తో ఫోన్​లో మాట్లాడి అధిక వర్షాలతో తెగిపోయిన ఊరకుంట చెరువు, సోమ్లా నాయక్ చెరువు (Somla Nayak Lake), కొండెంగల చెరువు, మల్లారం పెద్ద చెరువులతో పాటు జిల్లావ్యాప్తంగా అన్ని చెరువులను వెంటనే మరమ్మతులు చేపట్టాలని సూచించారు.  కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్టీవో పార్థసింహారెడ్డి, వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి, రెవెన్యూ తదితర శాఖల మండల, గ్రామస్థాయి అధికారులు పాల్గొన్నారు.