అక్షరటుడే, ఇందూరు: Mana Isuka Vahanam | ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకే ‘మన ఇసుక వాహనం’ ఆన్లైన్ విధానాన్ని అమలులోకి తెస్తున్నట్లు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ వైస్ ఛైర్మన్, ఎండీ భవేస్ మిశ్రా వెల్లడించారు. జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో కలిసి మాట్లాడారు.
రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద కొత్తగూడెం, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో ‘మన ఇసుక వాహనం’ ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని అమలు చేయాలని సంకల్పించామన్నారు. మాన్యువల్ విధానానికి స్వస్తి పలుకుతూ పూర్తిగా ఆన్లైన్ ద్వారా రవాణా జరిగేలా ఈ విధానం అందుబాటులో తెస్తున్నామని వివరించారు. దీంతో అక్రమ రవాణాకు చెక్ పడనుందని పేర్కొన్నారు.
Mana Isuka Vahanam | మొబైల్ ద్వారానే..
ఇసుక అవసరం ఉన్న వారు మొబైల్లో ‘మన ఇసుక వాహనం’ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్ పద్ధతిలో బుకింగ్ చేసుకోవచ్చన్నారు. స్మార్ట్ఫోన్ అందుబాటులో లేనివారు గ్రామ పంచాయతీ కార్యదర్శిని సంప్రదించి బుకింగ్ చేసుకోవాలని సూచించారు. గతేడాది సంస్థ ద్వారా ప్రభుత్వం రూ. 738 కోట్ల ఆదాయం సమకూరగా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ. వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్, పోలీస్, రవాణా శాఖ అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. ప్రయోగాత్మక అమలు తీరు అధ్యయనం చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు.
Mana Isuka Vahanam | నిబద్ధతతో పనిచేయాలి
మన ఇసుక వాహనం ఆన్లైన్ బుకింగ్ విధానం అమలు కోసం జిల్లాను ఎంపిక చేసినందుకు సంబంధిత శాఖ అధికారులు నిబద్ధతతో పనిచేసి విజయవంతమయ్యేలా చూడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. తాము అధికారులను ఇబ్బంది పెట్టబోమని, అలాగే అక్రమాలకు తావిచ్చే అధికారులను ఏమాత్ర ఉపేక్షించబోమని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా ఇసుక అక్రమ రవాణా జరిగితే సంబంధిత అధికారులను బాధ్యులుగా పరిగణిస్తామన్నారు. తహశీల్దార్లు కార్యస్థానాల్లో ఉంటూ పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. అలాగే సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు గట్టి పర్యవేక్షణ జరపాలని సూచించారు. సమావేశంలో సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, మైనింగ్ ఏడీ సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.